Friday, May 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమాంసభక్షణ గూర్చి వైదిక పవిత్ర గ్రంథాలేమన్నాయి?

మాంసభక్షణ గూర్చి వైదిక పవిత్ర గ్రంథాలేమన్నాయి?

- Advertisement -

మొదటి నుంచీ ఆవు భారతీయులకు పవిత్రమైం దేనని, హిందువులెప్పుడూ గోవధ చేయ లేదనీ, వాళ్లెప్పుడూ ఆవు మాంసం తినలేదని అమాయకంగా నమ్ముతున్న వారిని చూస్తే జాలేస్తుంది. అలాంటి వారు మనుస్మృతి, రుగ్వేదం, బృహదారణ్య కోపనిషత్తు, స్వామి వివేకానంద, పి.వి.కానే రచనల్లో ఏముందో తెలుసుకుంటే- అసలు విషయం గ్రహించ గలుగుతారు. మామూలు హిందువులు కాదు, అగ్రవర్ణం అని చెప్పుకుంటున్న వారి మాంసభక్షణ ఎలా ఉండేదో తెలుసు కుంటారు. మాంస భక్షణ గూర్చి ‘మనుస్మృతి’ ఏమంటుంది? ఆర్ష సాహిత్యంలో గోవధ, గోమాంస భక్షణ గురించిన ప్రస్తావనల్లో ఏముంది? వివరంగా చూద్దాం -}

నాత్తా దుష్యత్యదన్నాద్యాన్ ప్రాణినో హన్య హన్యపి ధాత్రైవ సృష్టా హాద్యాశ్చ ప్రాణినోత్తార ఏవచ (మనస్మృతి 5:30)
ప్రతిరోజూ భక్షించగలిగిన ప్రాణుల్ని భక్షించేవారికి ఏ దోషమూ కలగదు. ఎందుకంటే, స్వయంగా ఆ బ్రహ్మదేవుడే ఏవేవి భక్షింపదగినవో, ఎవరెవరు వాటిని భక్షించాలో రాసిపెట్టాడు- అని అర్థం.

నియక్తస్తు యథాన్యాయం యో మాంసం నాత్తి మానవ: స ప్రేత్య పశుతాం యాతి సంభవా నేకవింశతిం (మనుస్మృతి 5:35)
శాస్త్ర ప్రకారం శ్రాద్ధ మధుపర్కాలలో వాటిని నిర్వహిస్తున్న ద్విజుడు – (బ్రాహ్మణుడు) మాంసం భక్షించకపోతే (తినకపోతే) అతను మరణానంతరం మళ్లీ ఇరవై ఒక్క జన్మలు పశువుగా జన్మిస్తాడు – అని అర్థం.

మంత్ర జలంతో ప్రోక్ష‍ితం చేసిన మాంసాన్ని, యజ్ఞాలలో కాల్చబడ్డ పశుమాంస శేషాన్ని పలలాహారం పేరుతో బ్రాహ్మణులు భుజించాలి. పశుమాంస శేషం అంటే కాల్చిన మాంసపు ముద్దలు – అంటే ‘కబాబ్‌’‌ల వంటివి అని అర్థం! ఈ పలలా హారం అనే పదం నుండే పలహారం అనేది వాడుకలోకి వచ్చింది. ఇక మాంసాన్ని ప్రోక్షితం చేయడమంటే- ముస్లింలు ‘హలాల్ చేసిన విధంగా వైదికులు మాంసాన్ని మంత్ర జలంతో ప్రోక్షితం చేస్తారు. ఏది ఏమైనా బ్రాహ్మణులు మాంస భక్షణ చేయాలి అన్నది అందులోని నియమం. అలాగే, దేవతలకు, పితరులకు సమర్పించి మిగిలిన మాంసం తింటే మాంస భక్షణ దోషం ఉండదు (5-32) దేవతలుగానీ, చనిపోయిన ఫితరులు గానీ వచ్చి మాంసభక్షణ చేసి పోయినట్టు రుజువు లేదు. ఇకపోతే, మరొక చోట (5-56) లో చెప్పినట్టు- విధిచే విధించబడ్డ మద్యపాన, మైథున మాంసభక్షణల వంటి విషయాలలో బ్రాహ్మణాది వర్గాలకు వారి వారి యోగ్యతను అనుసరించి వ్యవహరించడం దోషం ఏమాత్రం కాదు – అని ఉంది. అయితే, అందుకు భిన్నమైన అభిప్రాయం కూడా అందులోనే మరోచోట ఇలా ఉంది. ప్రాణులను చంపకపోతే, మాంసం లభించదు. మాంసభక్షణ మానెయ్యాలనుకుంటే, ప్రాణులను చంపకుండా ఉండాలి (5-48) బహుశా ఈ సూచన-అప్పుడు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్న బౌద్ధద్ధమ్మ అహింసా సిద్ధాంతపు ప్రభావం వల్ల వచ్చి ఉంటుంది. ఈ విషయాన్నే ప్రసిద్ధ చరిత్రకారులు నిర్ధారించారు. కాలక్రమంలో శాకాహారం తీసుకోవడం ఉత్తమమైందనీ, అదొక గొప్ప సుగుణమని పురోహితవర్గం ప్రచారం ప్రారంభించింది. మాంసాహారం నీచమైందని, అది తినేవారు మ్లేచ్ఛులనీ అన్నారు. ‘మ్లేచ్ఛ’ పదాన్ని మొదట్లో బౌద్ధాయనుడు ఇలా నిర్వచించాడు-

‘గోమాంస ఖాదకోయస్తు విరుద్ధం బహుభాషతే
సర్వాచార విహీనశ్చ/మ్లేచ్ఛ ఇత్యాభిధీయతే’

రాను రాను మ్లేచ్ఛ పదం మాంసాహారికి పర్యాయ పదమైంది. వీటిని లోతుగా అర్ధం చేసుకుంటే తెలిసేదేమంటే- ఒకప్పటి మాంసాహారులే ఇప్పుడు శుద్ధ శాకాహారులుగా చలామణి అవుతున్నారు. పైగా మాంసాహారం నీచమైంది అన్న భావనతోనే వీరు దానికి ‘నీచు’ అని నామకరణం చేశారు. ఆపస్తంబ గృహ్య సూత్రాలలో మాంసాహారం గూర్చి మరికొన్ని వివరాలున్నాయి. ఎవరైనా అతిధులు ఇంటికొచ్చి నపుడు, పితరులకు అష్టక బలి సమర్పించే సమయంలో లేదా వివాహ వేడుకలప్పుడు – ఇలా ముఖ్యమైన మూడు సందర్భా లలో గోవును చంపి, నిరభ్యంతరంగా వండి వడ్డించవచ్చని ఆపస్తంబ గృహ్య సూత్రాలలో (1 : 3-9) రాసుకున్నారు. శతపథ బ్రాహ్మణంలోని మూడవ కాండం – మొదటి అధ్యాయం – రెండవ బ్రాహ్మణంలోని ఇరవై ఒకటవ మంత్రంలో యజ్ఞవల్కుడు – ‘‘నేను బాగా బలిసిన ఆవు మాంసాన్ని తినడానికి ఇష్ట పడతాను. అయితే అది లేతగా, మృదువుగా ఉండాలి” – అని అన్నాడు.

‘రాజ్ఞేవా బ్రాహ్మణాయ వా మహోక్షం
వా మహాజం వా పచేత్తదహ మానుషం’

యజ్ఞం చేస్తున్న సందర్భంలో అతిథులుగా రాజు వచ్చినా, బ్రాహ్మణుడు వచ్చినా వారికి యజ్ఞ నిర్వాహకుడు సోమరసాన్ని ఇవ్వాలి. ఎద్దు మాంసాన్ని, అలాగే మేక మాంసాన్ని వండించి పెట్టాలి – అని శతపథ బ్రాహ్మణంలో మూడవ కాండం, నాలుగో అధ్యాయం మొదటి బ్రాహ్మణంలోని రెండో మంత్రంలో ఉంది. ఆవుకు పవిత్రత ఆపాదించబడుతున్న కొద్దీ క్రమంగా అతిధి సత్కారాలలో గోమాంసానికి బదులుగా ఎద్దు మాంసం వినియోగించాలని మార్చి రాసుకున్న విషయం ఇక్కడ గమనించవచ్చు- రుగ్వేదంలో అక్కడక్కడా ఆవుకు పవిత్రత ఆపాదించబ డింది. దాన్ని ‘అదితి’ అని ‘దేవత’ అనీ సంభోదించేవారు. పైగా ఆవును ‘అఘ్న్యా’ – అని అన్నారు. అఘ్న్యా – అంటే చంపకూడ నిది అని అర్థం. చంపకూడనిదన్న విశేషణంతో దాని స్థాయి పెంచారు. కాలం గడిచిన కొద్దీ అధర్వణ వేదం కాలం నాటికి ఆవును పవిత్రమైన జంతువుగా పూజించాలన్న ఆలోచన పూర్తిగా స్థిరపడింది. అంతకు ముందున్న ఆవు మాంసం స్థానంలో ఇతర జంతువుల మాంసాల్ని చేర్చుకున్నారు. ఈ విషయం అధర్వణ వేదం 12:4,5లో గమనించొచ్చు. అందుకే పరాశర స్మృతి (4:76) లో స్పష్టంగా ఇలా ఉంది. “ శ్రాద్ధానికి గోమాంసానికి బదులుగా చేప మాంసం, లేడి మాంసం, మేక మాంసం లేదా అడవి పంది మాంసం ఉచితమై నవి” అని రాసి ఉంది. ఆవును వదిలేసి, ఇతర జంతు మాంసాలు వాడుకోవాలన్న నిర్ధారణ జరిగింది.

స్వామి వివేకానందను హిందూ మత ఉద్ధారకుడిగా పొగడుతూ ఉంటారు కదా? అందువల్ల ఆయన చెప్పిన మాటను తప్పక స్వీకరించాలి! గోమాంస భక్షణ గురించి ఆయన ఏం చెప్పారంటే- “ ఒకప్పుడు భారత దేశంలో గోమాంస భక్షణం చేయని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే కాదు” – ఈ మాట స్వామి వివేకానంద రచనా సర్వస్వం: మూడవ సంపుటం : 174వ పేజీలో ఉంది. ఇది అద్వైత ఆశ్రమం వారి ప్రచురణ. భారతరత్న పి.వి.కానే అనే పండితుడు “ ధర్మ శాస్త్రవిచార్’ అనే తన మరాఠీ గ్రంథంలో- పరిశుద్ధంగా ఉండే కారణంగా గోమాంస భక్షణం పవిత్రమైనదని వాజసనేయ సంహిత పేర్కొంది” – అని రాశారు. ‘బృహదారణ్య కొపనిషత్తు’ పై తను రాసిన భాష్యంలో ఉక్ష మాంసంతో- అంటే వీర్యవంతమైన ఎద్దు మాంసంతో కలిపి వండిన వంటకాన్ని సమర్పించాలని ఆది శంకరాచార్యు లు ప్రస్తావించారు ( 6-4-18) మహాభారతం ప్రకారం రంతిదేవుడనే రాజు రోజూ రెండు వేల గోవులను, మరో రెండు వేల ఇతర జంతువులను చంపించి, వాటి మాంసా న్ని ప్రజలకు దానం చేసేవాడు”- చరిత్రకారుడు రమేశ్ చంద్ర మజుదార్ సంపాదకత్వంలో వెలువడ్డ ‘ద హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్‌’లో ఈ మాట ఉంది – ఇది భారతీయ విద్యాభవన్ వారి ప్రచురణ. వాల్మికి రామాయణం రాసిన కాలంలో గోవులను బలి ఇవ్వడం ఒక ఆచారంగా ఉండేది. ఈ విషయం ఆ వాల్మికి రామాయణంలోనే ఉంది. ఉదాహరణకు రాముడు, సీత అరణ్యవాసానికి బయలుదేరుతున్న సన్నివేశం చూడండి. గంగానది ఒడ్డుకు చేరగానే, సీత గంగకు నమస్కరించి మొక్కుకుంటుంది. ‘తాము క్షేమంగా ఆరణ్యం నుంచి తిరిగివచ్చినట్లయితే, పదివేల ఆవులను బలి ఇస్తా’నని – అంటుంది. అలాగే మహాభారతం అనుశాసన పర్వం, ఎనభై ఎనమిదవ అధ్యాయంలో జంతుబలుల గూర్చి సవివరంగా ఉంది.

శ్రాద్ధకర్మల సమయంలో పితృదేవతలను సంతృప్తిపరచ డానికి ఏమేమి సమర్పించాలని ధర్మరాజు భీష్ముణ్ణి అడుగుతాడు. అప్పుడు భీష్ముడు ఓపికగా చాలా వివరాలు తెలియజేస్తాడు. భీష్ముడి సమాధానం ఇలా సాగుతుంది. శ్రాద్ధ కర్మలో నువ్వులు, అన్నం, అంబలి, నీళ్లు, పళ్లు, దుంపలు మొదలైనవి సమర్పిస్తే పితృ దేవతలు ఒక నెల వరకు సంతుష్టి పడతారు. ఒకవేళ చేపలు సమర్పిస్తే రెండు నెలలు, గొర్రె మాంసం సమర్పిస్తే మూడు నెలలు, కుందేలు మాంసం సమర్పిస్తే నాలుగు నెలలు, మేక మాంసమైతే ఐదు నెలలు, పంది మాంసం సమర్పిస్తే ఆరునెలలు సంతుష్టి పడతారు?’’ అని చెప్పుకుంటూ అనేక పక్షుల, జంతువుల జాబితా ఇస్తాడు. పితృదేవతల్ని ఎంత కాలం సంతృప్తి పరుస్తూ ఉంటే, అంత కాలం ఇక్కడ శ్రాద్ధకర్మలు నిర్వహించిన వారికి పుణ్యఫలం దక్కుతూ ఉంటుందంటాడు. ప్రీష్ట – అనబడే దుప్పి మాంసం సమర్పిస్తే ఎనమిది నెలలు పితృదేవతలు సంతుష్టి చెందుతారు, రురు మాంసంతో తొమ్మిది నెలలు, గవయ మాంసంతో పదినెలలు, దున్నపోతు మాంసంతో పదకొండు నెలలు, సంతృప్తి చెందుతారు. ఇక్కడ పితృకార్యం నిర్వహించే వారికి కూడా పుణ్యం అంతకాలం పాటు లభిస్తూ ఉంటుంది. అని చెప్పుతూ ఒకవేళ ఆ వరుసలో ఆవు మాంసం సమర్పిస్తే పితృదేవతలు ఒక సంవత్సర కాలం పాటు సంతుష్టుల వుతారు- అని అంటాడు. ఇక్కడ ఆవు మాంసానికి గల ప్రాధా న్యత ప్రాముఖ్యం ఎంతో ఉంది అని చెప్పకనే చెపుతాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు మరొక ప్రశ్న వేస్తాడు. పితృ దేవతలు అనంత కాలం పాటు సంతృప్తి చెందాలన్నా, ఇక్కడి వారికి పుణ్యం అనంత కాలాల పాటు దక్కాలన్నా ఏం చేయాలని అడుగుతాడు. అందుకు భీష్ముడు మరికొన్ని విషయాలు చెపుతాడు.

ఆవు మాంసంతో పాటు పితృదేవతలకు పాయసం కూడా సమర్పించాలని చెపుతూ, మరికొన్ని జంతు బలుల గురించి చెపుతాడు. విధ్రింస అనే బలిష్టమైన ఎద్దు మాంసం పితృ దేవతలకు సమర్పిస్తే, వారు పన్నెండు సంవత్సరాలు సంతృప్తి పడతారనీ, ప్రతి సంవత్సరం వారు చనిపోయిన నెలలో పున్నమి దినాలలో ఖడ్గమృగం మాంసం సమర్పిస్తే పితృదేవతలు అనంత కాలం వరకు సంతుష్టులవుతారనీ – చెపుతాడు. ఇది కాకుండా కలస్క అనబడే తోటకూర, కాంచన పుష్ప దళాలు, ఎరుపు రంగుగల మేకను బలి ఇచ్చి, దాని మాంసంతో పాటు అన్నీ కలిపి సమర్పించినా కూడా పితృ దేవతలు అనంత కాలాల పాటు సంతుష్టులవుతారు. ఓ ధర్మరాజా! ధర్మం తెలిసినవాడివి నీకు ఎక్కువగా చెప్పాల్సిన పనిలేదు- అంటాడు భీష్ముడు. ఇందులో ఒక ముఖ్యమైన మార్పును మనం గమనించొచ్చు. మాంసాహారం నుండి మెల్లెగా శాఖాహారంలోకి మారిన విధానం! పశుపాలకులు, పశుపోషకులూ అయిన అర్యులు కాలక్రమంలో వ్యవసాయం చేయడంపై దృష్టి పెట్టడం వల్ల -ఆవుకు గౌరవమైన స్థానం ఇవ్వడం జరిగింది. ఆవుల్ని చంపడమంటే పశు సంపదను కనిపెంచే తల్లుల్ని చంపడం- అన్న సత్తాన్ని చాలా ఆలస్యంగా గ్రహించారు. ఆవుల్ని చంపుకుంటే – పశు సంపద పెరగదు. వ్యవసాయం సాగదు. అవసరాలరీత్యా అవుకు ప్రత్యేకమైన గౌరవస్థానం- తల్లి స్థానం కాలక్రమంలో.. ఒక క్రమ పరిణామంలో భాగంగా ఏర్పడింది! అసలు విషయాలు పక్కకు నెట్టి – హిందుత్వ అతివాదులు తమ రాజకీయాల్ని ‘గోవు’ చుట్టూ తిప్ప్పుతున్నారని ఈ దేశ ప్రజలు గ్రహిస్తున్నారు, కాబట్టి ఇంకా వారి ఆటలు సాగవు! సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్.

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -