Friday, May 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమ్ములపొదికి మూడేండ్లు

అమ్ములపొదికి మూడేండ్లు

- Advertisement -

ఇరాన్‌ యుద్ధంలో కోల్పోయిన కీలకాయుధాల సముపార్జనకు..

వాషింగ్టన్‌ : ఇరాన్‌ యుద్ధంలో కోల్పోయిన కీలక ఆయుధాలను తిరిగి సముపార్జించుకోవడానికి అమెరికా సైనిక కాంట్రాక్టర్లకు కనీసం మూడేండ్లు పడుతుందని విశ్లేషణలు వెలువడ్డాయి. ఒకవేళ భవిష్యత్తులో చైనాతో ఘర్షణలు తలెత్తితే వాటిని ఎదుర్కొనేందుకు కావాల్సిన ఆయుధ నిల్వలు అమెరికా వద్ద లేవని ఆ విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరాన్‌ భూభాగంలోని లక్ష్యాలను ఛేదించే తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులను, క్షిపణులు-డ్రోన్లను నిలువరించే పాట్రియాట్‌-థాడ్‌ వ్యవస్థలను యుద్ధంలో అమెరికా ఉపయోగించింది. అయితే వాటిలో చాలా వరకూ దెబ్బతినడమో లేదా ధ్వంసం కావడమో జరిగింది. యుద్ధంలో కోల్పోయిన ఇలాంటి అత్యాధునిక ఆయుధాలను అభివృద్ధి చేసుకోవడానికి సమయం పడుతుందని సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్డడీస్‌ సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది. ట్రంప్‌ ప్రభుత్వం 2027వ సంవత్సరానికి ఒకటిన్నర ట్రిలియన్‌ డాలర్ల రక్షణ బడ్జెట్‌ను ప్రతిపాదించింది. అయితే ఇప్పుడు డబ్బు అనేది సమస్య కాదని, సమయమే ప్రధాన సమస్య అని ఆ నివేదిక అంటోంది.
ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి, కీలకమైన ఆయుధ వ్యవస్థలను నిర్మించుకోవడానికి సమయం పడుతుందని తెలిపింది. ఏ యుద్ధాన్ని అయినా ఎదుర్కొనే సామర్ధ్యం అమెరికాకు ఉన్నదని అధ్యక్షుడు ట్రంప్‌, రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ బీరాలు పలుకుతున్నారు. ఆయుధ ఉత్పత్తిని వేగవంతం చేయాలని రక్షణ కాంట్రాక్టర్లపై వారు ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ విచారణలలో క్షీణిస్తున్న ఆయుధ నిల్వలపై ఆందోళన వ్యక్తమైంది. యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా వెయ్యికి పైగా తోమహాక్‌ క్షిపణులు ప్రయోగించింది. వీటిని తిరిగి అమ్ములపొదిలో చేర్చుకోవాలంటే 2030 వరకూ వేచి ఉండాల్సిందే. ఇక థాడ్‌ వంటి గగనతల రక్షణ వ్యవస్థల పునర్మిర్మాణం 2029 చివరి నాటికి కానీ పూర్తి కాదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -