– నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
– ఊరుకొండ ఎస్సై రమాదేవి
నవతెలంగాణ – ఊరుకొండ : వ్యవసాయ శాఖ నిబంధనల ప్రకారం ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు విక్రయాలకున సాగించాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఊరుకుంటా ఎస్సై రమాదేవి, వ్యవసాయ అధికారిని దీప్తిలు అన్నారు. శుక్రవారం ఊరుకొండ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరియు ఊర్కొండ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రమాదేవి గారితో కలిసి మండలంలోని వ్యవసాయ ఇన్పుట్ దుకాణాలను తనిఖీ చేశారు. తనిఖీలలో నకిలీ విత్తనాలు, ఎరువుల నిల్వలు, పురుగుమందుల ఉత్పత్తులను పరిశీలించడంతో పాటు డీలర్ల స్టాక్ రిజిస్టర్లు, బిల్ పుస్తకాలు మరియు విక్రయ రికార్డులను తనిఖీ చేశారు.
డీలర్లకు సీడ్ ఆక్ట్ -1966, ఎసెన్షియల్ కమాడిటిస్ ఆక్ట్–1955 కింద ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ –1985 మరియు ఇన్సెక్టిసైడ్స్ ఆక్ట్ –1968 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. దుకాణంలో లైసెన్స్‌ను స్పష్టంగా ప్రదర్శించాలని, స్టాక్ బోర్డులను ప్రదర్శించడం మరియు రైతులకు తప్పనిసరిగా కొనుగోలు బిల్లులు ఇవ్వాలన్నారు. రికార్డులను సక్రమంగా నిర్వహించడం వంటి అంశాలపై నిబంధనలు గూర్చి వివరించారు. నకిలీ లేదా అనధికార వ్యవసాయ ఇన్పుట్ల విక్రయాలు జరిపిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఇన్పుట్లు అందేలా చర్యలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో ఫర్టిలైజర్ దుకాణదారులు, తదితరులు ఉన్నారు.



