సమసమాజ స్థాపనతోనే నాగేశ్వరరావుకు నిజమైన నివాళి : సంతాపసభలో.. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-కాజీపేట
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు నిర్వహించాలని, ఆర్థిక, సామాజిక అంతరాలు లేని సమసమాజ స్థాపనే లక్ష్యంగా కమ్యూనిస్టులు కదలాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ జిల్లా కాజీపేటలోని పారడైజ్ ఫంక్షన్ హాల్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు కామ్రేడ్ ఉప్పనపల్లి నాగేశ్వరరావు సంతాప సభలో ఆయన మాట్లాడారు. సమాజంలో నేడు నెలకొన్న ఆర్థిక అసమానతలకు, సామాజిక అణిచివేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలే ప్రధాన కారణమని అన్నారు. ఈ విధానాలను ఎదిరించేలా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించడమే నాగేశ్వరరావుకి ఇచ్చే నివాళి అని తెలిపారు.
వరంగల్‌లోని న్యూ శాయంపేట, సూర్జిత్ నగర్, పెద్దమ్మ గడ్డ వంటి కాలనీల ఏర్పాటులో భూస్వామ్య శక్తులను ఎదిరించి నిరుపేదల పక్షాన నాగేశ్వర్‌రావు నిలిచారని గుర్తు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర, ఎరువుల సరఫరా కోసం అనేక ఉద్యమాలు నడిపారని అన్నారు. పార్టీ పత్రిక ‘ప్రజాశక్తి’ సర్కులేషన్ ఇన్‌చార్జిగా, గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం నేతగా, కళాకారుడిగా విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. నాగయ్య, పోతినేని సుదర్శన్ రావు, నున్నా నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు జి. రాములు, ఎస్.వాసుదేవ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ, టి. స్కైలాబ్ బాబు, ఉడుత రవీందర్, హనుమకొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం చుక్కయ్య, బోట్ల చక్రపాణి, రాగుల రమేష్, కాజీపేట మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య, నాగేశ్వరరావు సతీమణి లక్ష్మి, కుమారుడు వినయ్ సహా కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



