నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇస్తుండగా, విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డంకి కలిగించి, చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సభ నుంచి వాకౌట్ చేశారు.
మాజీ సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నరవణే తన ఆత్మకథలో రాసిన కొన్ని కీలక అంశాలపై లోక్‌సభలో చర్చకు అనుమతించకపోవడమే ఈ గందరగోళానికి ప్రధాన కారణం. 2020లో చైనాతో సరిహద్దు ఘర్షణల సమయంలో రాజకీయ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందలేదని నరవణే పేర్కొన్నారని, ఆ భాగాలను చదివి వినిపించేందుకు లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశంపై గత మూడు రోజులుగా లోక్‌సభ దద్దరిల్లుతోంది. బుధవారం లోక్‌సభలో మహిళా ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలపడంతో సభ వాయిదా పడి, ప్రధాని ప్రసంగం నిలిచిపోయింది.



