20 ఏళ్లు జర్నలిస్టులు ఆశగా ఎదురుచూపులు
నవతెలంగాణ-అచ్చంపేట
ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య ఉంటూ ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పల్లె ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో విలేకరుల పాత్ర ఎంతగానో ఉంటుంది. ఎలాంటి గౌరవ వేతనాలు లేనప్పటికీ సామాజిక బాధ్యతతో ప్రజలకు తమ వంతు సహకారం అందించాలని లక్ష్యంతో జర్నలిజం లో కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ గెలుపు కోసం జర్నలిస్టులను వినియోగించుకున్న పాలకులు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత జర్నలిస్టులను విస్మరిస్తున్నారని చెప్పడానికి ఇండ్ల స్థలాల కేటాయింపుల నిర్లక్ష్యమే ఇందుకు నిదర్శనం.
నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలలో పనిచేస్తున్న జర్నలిస్టులు గత 20 ఏళ్లుగా ఇండ్ల స్థలాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించడంలో అచ్చంపేట ను పాలించిన ఎమ్మెల్యేలకు స్థానిక జర్నలిస్టులు ఇళ్లస్థలాలు కేటాయించాలని పలుమార్లు వినతి పత్రాలు, విజ్ఞప్తులు చేసిన పట్టించుకోలేదు. నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారు. 2004 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ వంశీకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్థానికంగా పనిచేస్తున్న విలేకరులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తులు చేసిన సంఘటనలు ఉన్నాయి కానీ స్పందించలేదు.
తెలుగుదేశం పార్టీ నుంచి పోతుగంటి రాములు 2009 -2014 రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.10 ఏళ్లు అచ్చంపేట ను పాలించారు. ఇండ్ల స్థలాల విషయంపై స్థానిక విలేకరులు ఎన్నిసార్లు అడిగిన ఇదిగో….అదిగో.. అంటూ కాలక్షేపం చేశారు.2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. టిఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 10. ఏళ్ళు అచ్చంపేటలో పాలించాడు. ఇంటి స్థలాల విషయంలో జర్నలిస్టులు మభ్య పెట్టాడు. అర్హత గల పేద జర్నలిస్టులకు ఆశ కల్పించాడు. కనకాల మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో ఇండ్ల స్థలాలు కేటాయిస్తానని మాట ఇచ్చారు. అధికారంలో ఉండి జర్నలిస్టులకు అన్యాయం చేశాడు. హౌసింగ్ బోర్డు కాలనీ ముందు భాగంలో ఇండ్ల స్థలాల కోసం శంకుస్థాపనకు ఏర్పాట్లు కూడా చేశాడు కానీ ముందుకు సాగలేదు.
ప్రస్తుతం..
కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ వంశీకృష్ణ 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు గెలిచిన తర్వాత స్థానిక జర్నలిస్టులు పలుసార్లు ఎమ్మెల్యే దృష్టికి ఇళ్లస్థలాల విషయం తీసుకొచ్చారు. హాజీపూర్ చౌరస్తాలో ఆంజనేయస్వామి టెంపుల్ పక్కన ఇండ్ల స్థలాలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. రెండున్నర ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇండ్ల స్థలాల విషయం చర్చించకపోవడంతో అర్హత గల జర్నలిస్టులు నిరాశతో ఉన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్పందించి అర్హత గల పేద జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



