Wednesday, June 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు‌పతనం అంచున సామ్రాజ్యవాదం

‌పతనం అంచున సామ్రాజ్యవాదం

- Advertisement -


ప్రపంచంపై పట్టు కోల్పోతున్న అమెరికా
ఆధిపత్యం లేని సమాజమే సోషలిజం లక్ష్యం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పతనం అంచున అమెరికా సామ్రాజ్యవాదం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రపంచంపై అమెరికా పట్టును కోల్పోతున్నదని చెప్పారు. అందుకే మేక్‌ అమెరికా ‌గ్రేట్‌ అగైన్‌ అనే నినాదాన్ని ఆ దేశ అధ్యక్ష‍ుడు డోనాల్డ్‌ ‌ట్రంప్‌ ఇచ్చారని గుర్తు చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంక్ష‍ోభాన్ని అధిగమించడం కోసం, అధిక లాభాలను పొందడం కోసమే ప్రపంచీకరణను తెచ్చారని అన్నారు. ప్రపంచీకరణలో పెట్టుబడిని ఎక్కడైనా పెట్టుకోవచ్చనీ, వస్తువులను ఎక్కడైనా ఉత్పత్తి చేసి ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉందన్నారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి ఎక్కువ ఖరీదుకు అమ్ముకుంటూ అధిక లాభాలు పొందుతున్నారని విమర్శించారు. ప్రపంచీకరణ వల్ల బడా పారిశ్రామికవేత్తలు, బహుళ జాతి సంస్థలకు లాభాలు వచ్చాయన్నారు. అమెరికాతో భారత ప్రభుత్వం ట్రేడ్‌ ‌డీల్‌ ‌చేసుకుందని చెప్పారు. దాని వల్ల అమెరికా నుంచి భారత్‌‌కు దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు ఉండబోవని అన్నారు. కానీ భారత్‌ ‌నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 18 శాతం సుంకం కట్టాల్సి ఉందని వివరించారు. అమెరికా సామ్రాజ్యవాదానికి, నయా ఉదారవాద విధానాలకు ప్రమాదం రావడం వల్లే ట్రంప్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. లాభాలు పెంచుకోవడానికి, ప్రపంచంపై ఆధిపత్యం కొనసాగించడం కోసమే ఇరాన్‌‌పై అమెరికా యుద్ధం చేస్తున్నదని చెప్పారు. వనరులపైనా, చమురుపై ఆధిపత్యం చేయాలని ప్రయత్నిస్తున్నదని అన్నారు.
చైనాను ఆర్థిక దిగ్బంధనం చేయాలని ట్రంప్‌ ‌భావించినా అది సాధ్యం కాలేదన్నారు. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన ట్రంప్‌ ‌దూకుడుగా వ్యవహరించలేదని చెప్పారు. అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యం లేని కొత్త ప్రపంచం రాబోతుందని అన్నారు. అయితే అమెరికా సామ్రాజ్యవాదం స్థానంలో చైనా సామ్రాజ్యవాదం వస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వివరించారు. ఆధిపత్యం లేని సమాజం ఉండాలన్నదే తమ లక్ష్యమని చైనా ప్రకటించిందని గుర్తు చేశారు. ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలోనే కొత్త వ్యవస్థ ఉండాలనీ, ప్రపంచబ్యాంకు బదులుగా ఏషియన్‌ ‌డెవలప్‌‌మెంట్‌ ‌బ్యాంక్‌ (ఏడీబీ) ఉంటుందని చెప్పారు. అయితే బ్రిక్స్‌ ‌నిబంధనలను భారత్‌ ‌పాటించడం లేదనీ, అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. భారత ప్రభుత్వం తీరులో మార్పు రావాలని అన్నారు. దేశంలో ఆర్థిక పోరాటాలే కాకుండా సామాజిక, సాంస్కృతిక పోరాడాలనూ కమ్యూనిస్టులు నిర్వహించాలని చెప్పారు. ప్రజా ఉద్యమాల ద్వారానే కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారని అన్నారు. ఒక బూర్జువా పార్టీ స్థానంలో మరో బూర్జువా పార్టీ అధికారంలోకి రావడం వల్ల ప్రజల స్థితిగతుల్లో మార్పు రాదన్నారు. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తేనే ప్రజల జీవన ప్రమాణాలతోపాటు వ్యవస్థలోనే మార్పు వస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో నవ తెలంగాణ సీజీఎం పి ప్రభాకర్‌, సంపాదకులు రాంపల్లి రమేశ్‌, నవ తెలంగాణ బుక్‌‌హౌస్‌ ‌సంపాదకులు కె ఆనందాచారి, జనరల్‌ ‌మేనేజర్‌ ‌నరేందర్‌‌రెడ్డి, నవతెలంగాణ వెబ్ ప్రతినిధి కె సతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -