Wednesday, June 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపేదరికప్రపంచానికే గేట్‌‌వే

పేదరికప్రపంచానికే గేట్‌‌వే

- Advertisement -

‌రాష్ర్టాభివృద్ధే సంకల్పం
తెలంగాణ రైజింగ్‌ సారధులు రైతులు, రైతు కూలీలే

2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీనే లక్ష్యం
గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీ
ఆర్థిక శక్తి కేంద్రాలుగా మహిళా సంఘాలు :
సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి
ఘనంగా తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకలు
జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
18 మంది పోలీసులకు ప్రతిభా పురస్కారాలు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రైజింగ్‌-2047కు సారధులు రైతులు, రైతు కూలీలేనని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. 2047నాటికి మూడు ట్రిలియన్‌ ‌డాలర్‌ ఎకానమీ సంకల్పం, తెలంగాణను ప్రపంచానికే గేట్‌‌వేగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్‌‌లోని పరేడ్‌ ‌గ్రౌండ్‌‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కళాకారుల ప్రదర్శనలను తిలకించారు. 18 మంది పోలీసులకు, వారి కుటుంబాలకు అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ అమరులను స్మరించుకు న్నారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్ష‍లు తెలుపుతూ తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్‌‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత సోనియాగాం ధీకి ధన్యవాదాలు తెలిపారు.
నిర్మూలనే ప్రాధాన్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా తెలంగాణ గడ్డపై పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు.

సాగునీటి రంగానికి ప్రాధాన్యత
ప్రాణహిత – చేవేళ్ల ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నామనీ, తుమ్మిడిహట్టి బ్యారేజీ కోసం మహారాష్ట్ర సీఎంకు పలు లేఖలు రాశామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పునరుద్ధరణ పనులు మొదలుపెట్టామని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల వాటా కోసం లౌక్యంతో కొట్లాడతామన్నారు.
ఆర్థిక శక్తి కేంద్రాలుగా మహిళా సంఘాలు
రాష్ట్రంలో మహిళా సంఘాలు ఆర్థిక శక్తి కేంద్రాలుగా, ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్ష‍ేత్రాలుగా మారాయని సీఎం అన్నారు. ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్‌లు, గోదాములు, రైస్ మిల్లులు ఏర్పాటుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆడబిడ్డలు దాదాపు రూ.10 వేల కోట్లు ఆదా చేసుకోగలిగారనీ, ఆ డబ్బులు ఆ కుటుంబాల ఆర్థిక బలోపేతం కోసం దోహదపడ్డాయని తెలిపారు. 42.90 లక్షల కుటుంబాలకు రూ.500 రూపాయలకే సిలిండర్లు, 53.09 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ అందుస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 3 కోట్ల 38 వేల మందికి సన్న బియ్యం ఇస్తున్నామన్నారు.

టార్గెట్‌ 4.50 లక్ష‍ల ఇందిరమ్మ ఇండ్లు
రూ.22, 500 కోట్లు కేటాయించి 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామనీ, కేవలం 13 నెలల కాలంలోనే లక్ష ఇండ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. సెప్టెంబర్ 17 నాటికి రెండు లక్ష‍ల ఇండ్లు పూర్తిచేస్తామని హామీనిచ్చారు. ​
గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు
రాష్ట్రంలోని నాలుగు లక్ష‍ల మంది గిగ్‌ ‌వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు ఇచ్చామని సీఎం రేవంత్‌‌రెడ్డి గుర్తుచేశారు. ఆ చట్టం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. 73 రంగాలకు చెందిన కార్మికులకు కనీస వేతనాలను నోటిఫై చేశామని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన యోధులను గుర్తించి, వారికి, వారి కుటుంబాలకు తగిన న్యాయం చేయాలన్న లక్ష్యంతో కె.కేశవరావు, కోదండరాం నాయకత్వంలో అధికారికంగా ఒక కమిటీ వేశామనీ, నివేదిక రాగానే వారందరినీ సముచిత రీతిలో సత్కరించి వారికి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన సర్వే కేంద్ర చేపడుతున్న జన గణనకు రోల్‌‌మోడల్‌‌గా నిలిచిందని తెలిపారు.

ఉద్యోగులకు రూ. కోటి బీమా పథకం
తమ ప్రభుత్వం ఉద్యోగులకు మొదటి తేదీనే వేతనాలు వేస్తున్నదని సీఎం గర్వంగా చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల కోసం ప్రతినెలా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. ఉద్యోగులకు కోటి రూపాయలతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకం అమలు చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. కన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించకుండా వృద్ధాశ్రమాలలో చేర్పించి చేతులు దులుపుకుంటున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల పోషణ జవాబుదారీతనం, పర్యవేక్షణకు చట్టం తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజా ప్రతినిధులను అందులో చేర్చామని తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణం విషయంలో పట్టుదలగా ఉన్నామన్నారు. గద్దరన్న పేరుతో సినీ అవార్డులు ఇస్తున్నామని సీఎం చెప్పారు. తెలంగాణ మత సామరస్యానికి ప్రతీకఅనీ, అన్నీ మతాలు, కులాలు తెలంగాణ తల్లి ఒడిలో బిడ్డలేనని స్పష్టం చేశారు.
క్యూర్-ప్యూర్-రేర్ మోడల్
“తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ డాక్యుమెంట్లో క్యూర్-ప్యూర్-రేర్ గా రాష్ట్రాన్ని వర్గీకరించి అభివృద్ధిలో మూడంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నామని సీఎం తెలిపారు. హైదరాబాద్‌‌లో కబ్జాకు గురైన చెరువులు, కుంటలను కాపాడి వాటిని పునరుద్ధరించే బాధ్యతను హైడ్రాకు అప్పగించామని తెలిపారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రో రైల్‌‌ను కొనుగోలు చేసి ప్రజల ఆస్తిగా మార్చామని తెలిపారు. మెట్రో ఫేజ్2లో 122.9 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించే ప్రతిపాదనలతో తయారు చేసిన డీపీఆర్ ను కేంద్రానికి సమర్పించామని చెప్పారు.
మూసీ పునరుజ్జీవనం
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం ఫేజ్-1 ప్రాజెక్టు కింద పనులు చేస్తామని తెలిపారు. మూసీ ప్రాజెక్టులో భాగంగానే గోదావరి ఫేజ్ -2, ఫేజ్`3 పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 2.5 టీఎంసీల గోదావరి జలాలను మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు తరలిస్తామని తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా మాసీ పరివాహకాన్ని తీర్చిదిద్దుతామన్నారు.
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ ‌సిటీ

30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తున్నామనీ, శంషాబాద్‌ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేయటం ద్వారా రీజనల్ కనెక్టివిటీ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్‌ ఎయిర్ పోర్ట్ అభివృద్ది పనులు త్వరలో ప్రారంభమవుతాయని ‌చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. నాస్కామ్ జీసీసీ ల్యాండ్ స్కేప్ రిపోర్ట్ 2026 ప్రకారం దేశంలో కొత్తగా ఏర్పాటైన బీఎఫ్‌ఎస్‌ఐ జీసీసీల్లో 50 శాతం హైదరాబాద్‌ను ఎంచుకోవడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ టూరిజం పాలసీ ద్వారా మూడు లక్ష‍ల ఉద్యోగాలు దక్కబోతున్నాయన్నారు. 2030 నాటికి తెలంగాణ టాప్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలబెట్టాలనేది లక్ష్యమని తెలిపారు. దీంతో ఐదు లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సకల పంటల క్ష‍ేత్రంగా తీర్చిదిద్దండి
తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైందని సీఎం చెప్పారు. పంటల మార్పిడి ద్వారా తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాలని రైతులకు పిలుపునిచ్చారు. రూ.20,616 కోట్లను రైతుల ఖాతాల్లో వేసి 25 లక్ష‍ల మంది రైతులను రుణ విముక్తులను చేశామనీ, ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తూనే సౌరశక్తితో నడిచే పంప్ సెట్లను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమానికి రూ. 1,56,496 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇప్పటివరకు 63.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి సుమారు రూ.11 వేల 903 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. అన్నదాతకు నష్టం రావద్దని దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. యాసంగి సీజన్‌లో దేశంలో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60 శాతం చెప్పారు. మొక్కజొన్నల కొనుగోళ్లకు సుమారు రూ. 4, 275 కోట్లు, జొన్న కొనుగోళ్లకు రూ.1,154 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించిందని తెలిపారు.

విద్యపై ఫోకస్‌
రెండున్నరేండ్లలో 67,763 పోస్టులను భర్తీ చేశామని సీఎం చెప్పారు. ఈ నెలలో టీజీపీఎస్‌‌సీ ద్వారా ఇంజినీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీశాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, విద్యాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. పేదరికం పోవాలన్నా, కుల, మత అంతరాలు తగ్గాలన్నా విద్యయే కీలకమని నొక్కి చెప్పారు. ఫెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో తెలంగాణ మంచి స్థానాన్ని పొందిందని గుర్తుచేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో విద్యా వ్యవస్థ బలోపేతం చేస్తామన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా 1,190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేయగా 838 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించటం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తామనీ. మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరించబోతున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -