Wednesday, June 3, 2026
E-PAPER
Homeక్రైమ్రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి

రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి

- Advertisement -

ముగ్గురికి తీవ్ర గాయాలు
ఆగి ఉన్న లారీని కారు ఢీకొని దంపతులు దుర్మరణం
కారు బోల్తా పడి ఇద్దరు..
నవతెలంగాణ-సిద్దిపేటఅర్బన్‌/కల్వకుర్తి టౌన్‌

రెండు కార్లు ప్రమాదాలకు గురై నలుగురు ఘటనా స్థలంలోనే ప్రాణం కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి మరో మూడు నాలుగు కిలోమీటర్లలో ఇంటికి చేరాల్సిన కుటుంబం కకావికలమైంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టంతో.. తీవ్రంగా గాయపడిన దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాదకర ఘటనలు సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో మంగళవారం జరిగాయి. సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి పరిధిలో జరిగిన ప్రమాదానికి సంబంధించి సిద్దిపేట త్రీటౌన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.మల్లేశం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
భద్రాద్రి జిల్లా మణుగూరుకు చెందిన రవిచంద్రనాథ్‌ వ్యాపార నిమిత్తం సిద్దిపేటలో స్థిరపడ్డారు. వేసవి కాలం నేపథ్యంలో.. భార్య సునిత, కుమారుడు అజరు, కోడలు అర్చనతో కలిసి మే 30వ తేదీన భద్రాచలానికి కారులో వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగి సిద్దిపేటకు ప్రయాణమయ్యారు. అయితే, మిట్టపల్లి శివారులోని రైల్వే లైన్‌ దగ్గరకు చేరుకోగా.. రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. దాంతో కారు నడుపుతున్న రవిచంద్రనాథ్‌(49), సునీత(45) తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. అర్చన, అజరుకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని కుటుంబీకులు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. కారు ముందు భాగం పూర్తిగా లారీ కిందకు ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. రవిచంద్రనాథ్‌ వియ్యంకుడు అంకం ప్రకాష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌ అంబటి శ్రీకాంత్‌ నిర్లక్ష్యంగా రోడ్డుపై ఆపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

కల్వకుర్తి సమీపంలో ప్రమాదం
ఇద్దరు యువకులు మృతి.. ఒకరి పరిస్థితి విషమం

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలంలోని తాండ్ర, కొండారెడ్డిపల్లి గేటు సమీపంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కల్వకుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంగూరు మండల కేంద్రానికి చెందిన బండపల్లి ప్రవీణ్‌, బండపల్లి రాజు, బండపల్లి బాలరాజు కారులో కల్వకుర్తి నుంచి వంగూరు వైపు వెళ్తున్నారు. తాండ్ర, కొండారెడ్డిపల్లి గేటు సమీపానికి చేరుకోగానే కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్‌, రాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవింగ్‌ చేస్తున్న బాలరాజుకు తీవ్రగాయాలు కాగా.. స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న కల్వకుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -