ఉద్యోగం నుంచి తొలగింపు
షీ టీంకు ఫిర్యాదు చేసిందనే..
ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో ఘటన !
ఉద్యోగం పునరుద్ధరణ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి డిమాండ్
నవతెలంగాణ – నల్లగొండ టౌన్
విధి నిర్వహణలో ఉండగా కార్యాలయంలో తనపై జరిగిన లైంగికవేధింపులు, అవమానాలపై షీ టీంకు ఫిర్యాదు చేసినందుకు మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఘటన ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌ఎస్ ఈటిఐ)లో జరిగింది. ఈ సంస్థ నల్లగొండ జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలకు స్వయం ఉపాధి, సొంత వృత్తులు ప్రారంభించుకోవడానికి ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తోంది. అక్కడ కొన్నాళ్లుగా పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని ఓ డైరెక్టర్ పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేయడంతో షీ టీం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక డైరెక్టర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ షీ టీం, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం సంబంధిత అధికారి బదిలీ అయినప్పటికీ, తనపై కక్షసాధింపు చర్యలు ప్రారంభమయ్యాయని బాధితురాలు ఆవేదన వెలిబుచ్చారు. ఉద్యోగంలో ఎటువంటి లోపాలూ లేవని, ఎప్పుడూ పనితీరు గురించి హెచ్చరికలు ఇవ్వలేదని, పనితీరు అంచనాలు నిర్వహించలేదని అన్నారు. అయితే ఈ ఘటన తర్వాత అకస్మాత్తుగా పనితీరు సరిగా లేదనే కారణం చూపుతూ థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు. తన ఉద్యోగాన్ని పునరుద్ధరించ డంతో పాటు, ఫిర్యాదు చేసినందుకు ప్రతీకార చర్యలు తీసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత ఉద్యోగిని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్, కార్మిక శాఖ, జిల్లా యంత్రాంగం సంబంధిత సంస్థ ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే కొంతమంది డైరెక్టర్లు శిక్షణకు వచ్చే మహిళలను కూడా ఇబ్బంది పెడుతున్నారని సమాచారం. ఇదిలా ఉండగా, ఇటీవల అక్కడ టైలరింగ్ శిక్షకురాలిని వెకిలి మాటలతో ఎవరికీ చెప్పుకోలేని విధంగా మాట్లాడటంతో.. బాధితులు అక్కడే ఉన్న ఓ మహిళా ఉద్యోగికి చెప్పుకొని బోరున విలపించినట్టు తెలిసింది. అయితే, మహిళలను ఇబ్బంది పెట్టే ఆ వ్యక్తిపై ఎస్‌బీఐలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలొస్తున్నాయి. లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత మహిళ ఉద్యోగం కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని మహిళా సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరాయి. అయితే, ఈ ఆరోపణలపై సంస్థ యాజమాన్యం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఉద్యోగినిపై కక్ష సాధింపు
- Advertisement -
- Advertisement -



