నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశమని, ఆదేశంతో తమ సంబంధాలను మరింత విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. రష్యాతో సహకారాన్ని తగ్గించుకోవాలని భారత్‌పై అమెరికా మరియు ఇతర పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు నిష్ఫలమైనవని, అవి అంతర్జాతీయ సంబంధాలకు నష్టం కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. గురువారం అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. భారతదేశ ఆర్థిక వృద్ధిని, ఆ దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. భారత్‌తో ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి రష్యా నిశ్చయించుకుందని, రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
రష్యాతో సంబంధాలను పరిమితం చేయాలంటూ భారత్‌పై పశ్చిమ దేశాలు ఒత్తిడి తెస్తున్నప్పటికీ, దానివల్ల తమపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడలేదని పుతిన్ సూచించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన, బలమైన నాయకత్వం ఉన్న భారతదేశంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు నిష్పలమని అన్నారు. ఈ ఒత్తిళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ముఖ్యం కాదని, ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇరు దేశాల బంధానికి ఎటువంటి ఢోకా లేదని, భవిష్యత్తులోనూ ఇరుదేశాల మధ్య స్నేహం ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను తగ్గించుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికాతో భారతదేశానికి ఉన్న అనుబంధం వల్ల రష్యాతో ఉండే చిరకాల సంబంధాలకు ఎటువంటి ఆటంకం కలగదని, భారత్‌ను తాము ఒక “విశ్వసనీయ భాగస్వామి”గా పరిగణిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశమని, ఆ దేశానికి ఇతర దేశాలతో ఉండే దౌత్య సంబంధాల వల్ల రష్యాకు ఎటువంటి ఇబ్బంది లేదని అన్నారు.
మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందిస్తూ.. సమస్యను పరిష్కరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఉక్రెయిన్ ను ఒప్పించడమే ఇప్పుడు చేయాల్సిన పని అని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలలో యూరోపియన్ యూనియన్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరించగలవన్న మీడియా వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆయుధాలు సరఫరా చేయడం ఆపి, ఉక్రెయిన్ ను రాజీకి ఒప్పించడం ద్వారానే ఇయు ఈ వివాద పరిష్కారానికి సహాయపడగలదని సూచించారు. రష్యాకు వ్యూహాత్మక ఓటమిని కలిగించాలని పదేపదే కోరుకునే పశ్చిమ దేశాలను తాము ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అధ్యక్ష పదవీకాలం ముగిసిపోయిందని పేర్కొంటూ.. అధ్యక్షుడిగా ఆయన చట్టబద్ధతను ప్రశ్నించారు. ఉక్రెయిన్ సంక్షోభం `ప్రాంతీయ’ సమస్య మాత్రమేనని, కానీ ఇరాన్ సమస్య ప్రపంచ సమస్య అని పేర్కొన్నారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి దోహదపడే ఏ నిర్ణయానికైనా మద్దతు ఇవ్వడానికి రష్యా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.



