జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరముల పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు మినీ మీటింగ్ హాల్ లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరముల వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు 28 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షలు రాసేందుకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 6550 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6263 మంది మొత్తం 12813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పరీక్షల నిర్వహణకు ఉదయం 8 గంటల వరకే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు.
సంబంధిత అధికారులు కేటాయించిన విధులను అత్యంత జాగ్రత్తతో అప్రమత్తంగా నిర్వహించాలన్నారు. ప్రశ్న పత్రాల తరలింపు లో అత్యంత భద్రత తీసుకోవాలన్నారు.విద్యార్థులు సమయానుకూలంగా పరీక్షా కేంద్రాలకు చేరే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, నిరంతరం పరీక్ష కేంద్రాలలో విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పరిధిలో, త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో శానిటేషన్ అన్ని పరీక్ష కేంద్రాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్లను,వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రశ్నాపత్రాల కవరు శీలు తీయటం, జవాబు పత్రాలను కవరులో ఉంచి శీలు వేయడం సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందన్నారు.
మొబైల్ ఫోన్లను అనుమతించడం జరగదన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు మూసి వేయించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ పరీక్ష కేంద్రాలలో ఆకస్మికంగా సందర్శిస్తూ పరీక్షల నిర్వహణ సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీ నారాయణ,భువనగిరి ఆర్డీఓ కృష్ణా రెడ్డి,జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి , జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, జిల్లా అసిస్టెంట్ ట్రెజరీ అధికారి మోహన్ రావు, తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



