– మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌లో కార్మికులు బతుకు జీవుడా అని ఆందోళనగా ఉన్నారు. సోమవారం కూడా కార్మికులను వెలికితీయడం సాధ్యం కాలేదు. దీంతో వరసగా 16వ రోజూ 41 మంది కార్మికులు టెన్నెల్‌లో చిక్కుకుని ఉన్నారు. కార్మికులను రక్షించడం కోసం ప్రారంభించిన వెర్టికల్ డ్రిల్లింగ్‌లో భాగంగా సోమవారం సాయంత్రం 7 గంటల సమయానికి 36 మీటర్లు దూరం డ్రిల్లింగ్ పూర్తి చేశారు. ఈ వెర్టికల్ డ్రిల్లింగ్‌ను ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 86 మీటర్ల డ్రిల్లింగ్‌ను ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. వెర్టికల్ డ్రిల్లింగ్ పనులు సాగుతున్నా.. వచ్చే రెండో రోజులు వర్షాలు, హిమపాతం కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడం ఆందోళన కలిగిస్తుంది. వర్షాలు, హిమపాతం కార్మికుల వెలికితీతకు అంతరాయం కలిగిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
మాన్యువల్ డ్రిల్లింగ్‌ను కూడా సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభించారు. ఇందుకోసం ర్యాట్-హోల్ మైనర్లు కూడా తీసుకునివచ్చారు. వీరు సాయంత్రం సమయానికి 1 మీటరు దూరం డ్రిల్లింగ్ పూర్తి చేశారు. ఒక మీటరు పైపుని లోనికి నెట్టారు. ఈ మాన్యువల్ డ్రిల్లింగ్‌కు సమయం ఎక్కువ పట్టినా ఇదే కార్మికులను బయటకు తీసుకుని రావడానికి సహాయం పడుతుందని కొంత మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ ఈ నెల 12న కూలిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 41 మంది కార్మికులు అందులో చిక్కుకుని ఉండిపోయారు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.