కొడంగల్‌ దంగల్‌..!

కొడంగల్‌ దంగల్‌..!– రేవంత్‌ వర్సెస్‌ పట్నం
– గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు
– హైదరాబాద్‌ నుంచి చక్రం తిప్పుతున్న బీఆర్‌ఎస్‌ పెద్దలు
– గులాబీ వ్యూహాలకు చెక్‌ పెట్టేందుకు హస్తం ఎత్తుగడలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర రాజకీయాల్లోనే కొడంగల్‌ నియోజకవర్గం హాట్‌ టాఫిక్‌గా మారింది. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులకు చెక్‌ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక్కడి నుంచి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పోటీ చేయడమే ఇందుకు కారణం. బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. దాంతో ఇరుపార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రేవంత్‌ను కొడంగల్‌కే పరిమితం చేయాలని, అతన్ని ఎలాగైనా ఓడించాలని బీఆర్‌ఎస్‌ భావిస్తుంటే.. ఓడిన చోటే గెలిచి తన సత్తా చాటాలని రేవంత్‌ భావిస్తున్నారు. దాంతో కొడంగల్‌ దంగల్‌ రసవత్తరంగా మారింది.
రేవంత్‌రెడ్డి గతంలో కొడంగల్‌ నుంచి ప్రాతినిధ్యం వహించినా.. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. దాంతో ఈసారి ఎలాగైనా తన పట్టు నిలుపుకోవడం కోసం కొడంగల్‌పై రేవంత్‌ ఫోకస్‌ పెట్టారు. సీఎం కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేస్తున్నప్పటికీ కొడంగల్‌పైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే బీఆర్‌ఎస్‌ సైతం కొడంగల్‌పై పట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. గత ఫలితాలనే పునరావృతం చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇక్కడ పట్నం నరేందర్‌రెడ్డి పోటీలో ఉన్నప్పటికీ ఈ ఎన్నికను బీఆర్‌ఎస్‌ పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ నుంచి కొడంగల్‌ రాజకీయాలను పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు లోకల్‌ నాయకులకు గైడ్‌లైన్స్‌ ఇస్తున్నారు. అభ్యర్థి సభల్లో మాట్లాడాల్సిన అంశాలను సైతం తెలంగాణ భవన్‌ నుంచే స్క్రీప్ట్‌ పంపుతున్నట్టు సమాచారం. రేవంత్‌రెడ్డి ఓడించడమే టార్గెట్‌గా స్వయంగా నియోజకవర్గ రాజకీయ సమీకరణలపై సీఎం కేసీఆర్‌ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో ఉన్న రిపోర్టును వారం వారం తెప్పించుకుంటూ ప్రజానాడీకి అనుగుణంగా లోకల్‌ ఎజెండాను ప్రజల ముందుకు తీసుకుపోయేందుకు బీఆర్‌ఎస్‌ వ్యూహం పన్నుతున్నట్టు సమాచారం. సీఎం అభ్యర్థిగా సైతం రేవంత్‌ పేరు వినిపిస్తుండటంతో ఈ ఎన్నికలు రేవంత్‌కు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
రేవంత్‌కు అండగా గురునాథ్‌..
బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గురునాథ్‌రెడ్డి హస్తం గూటికి చేరడంతో కొడంగల్‌లో కాంగ్రెస్‌కు తిరుగులేదని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. గురునాథ్‌ అండ ఉన్న అభ్యర్థి ఓటమి చెందిన చరిత్ర లేదని గత ఫలితాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో గురునాథ్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోసం పనిచేయడంతో పట్నం నరేందర్‌రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం పోటీలో ఉన్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులు ఇద్దరూ నాన్‌ లోకల్‌. గురునాథ్‌ రెడ్డి మాత్రం స్థానికుడు. ఈ ప్రాంతంలో గురునాథ్‌ రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొడంగల్‌ నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటముల్లో గురునాథ్‌రెడ్డి కీలకం కానున్నారు. దాంతో విజయంపై కాంగ్రెస్‌ ధీమాగా ఉంది. అయితే స్థానిక ప్రజలు ఎటువైపు ఉంటారో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

Spread the love