ఈ అడవికి కాపలా ఎర్రజెండా

Guard this forest red flag– భద్రాచలంలో విజయఢంకా మోగిస్తాం
– రామయ్యను వివక్షకు గురి చేసింది తోడు దొంగల పార్టీలే
– పోలవరం ఎత్తు తగ్గించాలని పోరాటాలు చేసింది కమ్యూనిస్టులే
– బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ఘాటైన అభ్యర్థి కారం పుల్లయ్య
– మేం ఎవరితోనూ పొత్తులకు వెంపర్లాడలేదు
– భద్రాచలం మర్చిపోండన్న కాంగ్రెస్సోళ్లకు ఓటమి తప్పదు
– పుల్లయ్య నామినేషన్‌ బహిరంగ సభలో సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- భద్రాచలం రూరల్‌/దుమ్ముగూడెం
భద్రాచలం అసెంబ్లీ స్థానం సీపీఐ(ఎం)కి గౌరవ ప్రదమైన స్థానం అని, ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని సీపీఐ(ఎం) పోలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. బుధవారం భద్రాచలం అసెంబ్లీ స్థానానికి సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారం పుల్లయ్య నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా భద్రాచలం పట్టణంలో ఆ పార్టీ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఇందులో రాఘవులు, తమ్మినేని మాట్లాడారు.
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన భద్రాద్రి రామయ్యను వివక్షకు గురి చేసింది తోడు దొంగల పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లేనని రాఘవులు అన్నారు. కారం పుల్లయ్య ఎమ్మెల్యేగా గెలిస్తే భద్రాచలం ప్రాంతంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. సమస్యలను పరిష్కరించే సత్తా ఒక్క కమ్యూనిస్టులకు మాత్రమే ఉంటుందని తెలిపారు. భద్రాచలం పట్టణంలో రోజువారీగా ఉత్పత్తి అయ్యే చెత్తను వేయడానికి కనీసం డంపింగ్‌ యార్డు కూడా లేదన్నారు. ఈ దుస్థితికి కారణమైన బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. భద్రాచలం మండలం నుంచి విడిపోయిన ఐదు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలపాలని, పోలవరం ఎత్తు తగ్గించాలని లేకపోతే భద్రాద్రి ముంపునకు గురి అవుతుందని పోరాటాలు చేసి జైళ్ల పాలయిన చరిత్ర సీపీఐ(ఎం)కి ఉందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) బలమైన శక్తిగా ఉందని, ఇక్కడ పార్టీ అభ్యర్థుల గెలుపునకు వామపక్ష పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టుల సాధన, దళిత గ్రామాల సమస్యల పరిష్కారం కోసం తమ్మినేని వీరభద్రం 3 నెలల పాటు పాదయాత్ర చేశారని రాఘవులు గుర్తు చేశారు.
భద్రాచలం అసెంబ్లీ స్థానానికి 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 8 పర్యాయాలు సీపీఐ(ఎం) నుంచి కుంజా బొజ్జి, సున్నం రాజయ్య, ముర్ల ఎర్రయ్యరెడ్డి ప్రాతినిధ్యం వహించారని తమ్మినేని తెలిపారు. నాటి నుంచి నేటి వరకూ ప్రజలతో ఉంటూ ఇండ్ల స్థలాలు, పోడు భూముల పోరాటంలో అటవీ శాఖ అధికారుల కందకాలను అడ్డుకుంటూ ‘ఎవడివిరా నువ్వు… అడవికి కాపలా కాసింది ఎర్ర జెండా’ అంటూ పోడు భూములకు పట్టాలు ఇప్పించిన చరిత్ర కమ్యూనిస్టులదని తెలిపారు. మతతత్వ బీజేపీని ఓడించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీకి మునుగోడు ఎన్నికల్లో మద్దతు ఇచ్చామన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎర్ర జెండాలు తన పక్కనే ఉండాలని, బీజేపీని దేశ వ్యాప్తంగా ఓడించేందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ పెడుతున్నానని చెప్పి నాలుక తిప్పాడన్నారు. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీతో సీట్ల సర్దుబాటులో భాగంగా 40 ఏండ్ల పాటు తాము ప్రాతినిధ్యం వహించిన భద్రాచలం అసెంబ్లీ స్థానాన్ని కోరామన్నారు. దీనికి కాంగ్రెస్‌ పార్టీలోని ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అహంకార పూరితంగా ఎమ్మెల్సీ పదవితో పాటు సోనియమ్మ, ఖర్గేతో మాట్లాడి మంత్రి పదవి ఇస్తామని తెలపడంతో సీపీఐ(ఎం) ఒంటరి పోరుకు సిద్ధం అయిందన్నారు. భద్రాచలం మర్చిపోండి అన్న కాంగ్రెస్సోళ్లకు భద్రాచలంలో ఓటమి తప్పదన్నారు. తాను ఎంపీగా పని చేసిన సమయంలో అన్ని పార్టీలు కలిసి సీపీఐ(ఎం) నేత జ్యోతిబసుకు ప్రధానమంత్రి పదవిని ఇస్తామని అంటే తిరస్కరించడం జరిగిందని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) నిత్యం ప్రజల్లో ఉండేందుకు, ప్రజావాణిని చట్ట సభల్లో వినిపించేందుకు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. భద్రాచలం అసెంబ్లీ స్థానంలో పోటీలో ఉన్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన అభ్యర్థులకు ఘాటైన, దీటైన అభ్యర్థి కారం పుల్లయ్య మాత్రమేనని, ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజారీటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభలో మాజీ ఎంపీ మిడియం బాబురావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూడి కృష్ణారెడ్డి, ఏజే రమేష్‌, డీసీసీబీ మాజీ చైర్మెన్‌ యలమంచి రవికుమార్‌, నాయకులు గడ్డం స్వామి, జి శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love