రాష్ట్రాన్ని దోచుకున్నారు

The state was looted– బీజేపీకి ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్టే..
– ప్రధాని మోడీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు?
– అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు : ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ విజయభేరీ సభల్లో రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, ఉట్నూర్‌
ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చిన ప్రతి సారి కేసీఆర్‌ అవినీతిని ప్రస్తావిస్తారని, కానీ నిత్యం అవినీతి నెపం మోపి విపక్షాల పైకి ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను పంపిస్తున్న మోడీ.. కేసీఆర్‌ అవినీతిని ఎందుకు పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటేనన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ పదవులు ఉన్నాయని, మూడోసారి సీఎం అయితే తన మనువడిని కూడా మంత్రిని చేస్తారని ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు దోచుకొని.. పేదల భూములు లాక్కొని, ఈ రాష్ట్రాన్ని అమ్ముకొని దేశం విడిచి పారిపోతారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కమీషన్లకు కక్కుర్తిపడి నిర్మించిన కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, అన్నారం పగిలిపోయిందని, సుందిళ్ల బ్యారేజీ ఎప్పుడు కొట్టుకుపోతుందో తెలియదని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ అవినీతి పాలనను అంతం చేసేందుకు ఈ ఎన్నికలు ఒక అవకాశమని, దాన్ని ఉపయోగించుకొని ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ నియోజకవర్గాల్లో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభల్లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని తుమ్మిడిహేటీ వద్ద ప్రాణహితపై ప్రాజెక్టు నిర్మించి ఈ జిల్లాలో 1.60లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భావించారని గుర్తుచేశారు. కానీ సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టు ఇక్కడ కాదని.. కాళేశ్వరంకు తరలించారని తెలిపారు. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్‌ ఏం చేసిందని మంత్రి హరీశ్‌రావు అంటున్నారని ఆయన్ను ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేసిన విషయం గుర్తించుకోవాలని హితవు పలికారు. తెలంగాణలోని నిధులు, నీళ్లు, నియామకాలు ఈ ప్రాంతానికే దక్కాలని సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు అమ్ముకుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోట్ల రూపాయలు ఉన్నోళ్లకే బీఆర్‌ఎస్‌ టికెట్లు ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్‌లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో అందరికీ అవకాశం ఇవ్వలేం కదా అని తెలిపారు.
కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారు..!
ధరణి తీసేస్తే రైతుబంధు రాదని.. ఉచిత కరెంటు మూడు గంటలే ఇస్తామని తాను అన్నట్టు కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 2018లో రైతుబంధు అమలైతే 2020లో ధరణి పోర్టల్‌ వచ్చిందని, మధ్యలో రెండేండ్ల పాటు రైతుబంధు ఆగిందా అని ప్రశ్నించారు. ప్రస్తుతం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని సీఎం చెబుతున్నారని, సబ్‌స్టేషన్లకు వెళ్లి లాగ్‌బుక్‌లు పరిశీలిద్దామని.. 24గంటలు ఇస్తున్నట్టయితే నాతో పాటు అభ్యర్థి కూడా నామినేషన్లు వేయబోమని సవాల్‌ విసిరారు. ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని..
కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి కంటే మెరుగైన పోర్టల్‌ తీసుకొస్తామని, రైతుభరోసా కింద ఎకరానికి రూ.15వేల చొప్పున రైతులు, కౌలు రైతులకు అందజేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ రూపొందించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, హస్తం పార్టీని ఆదరించాలని కోరారు. ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ అభ్యర్థులు కంది శ్రీనివాస్‌రెడ్డి, వెడ్మ బొజ్జుపటేల్‌లను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పలువురు బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌, కర్నాటక ఎమ్మెల్సీ ప్రకాష్‌రాథోడ్‌, నాయకులు బాలూరి గోవర్దన్‌రెడ్డి, గిమ్మ సంతోష్‌, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.

Spread the love