మాయలో పడొద్దు

Don't be fooled– గిరిజనేతరులకు పోడు పట్టాల కోసం కేంద్రంతో పోరాడతాం
– ఇప్పటికే పోడు పట్టాలిచ్చాం
– ఇంటింటికి నీళ్లు, 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
– ధరణిని వద్దంటున్న కాంగ్రెస్‌.. మళ్లీ దళారుల వ్యవస్థను తెస్తది..
– అభ్యర్థి గుణగణాలు, పార్టీ చరిత్ర తెలుసుకుని ఓటేయండి : ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-కాగజ్‌నగర్‌/ ఆసిఫాబాద్‌/కాసిపేట
రాష్ట్రంలో ఇప్పటికే గిరిజనులకు వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చామని, పోడు కేసులనూ ఎత్తేశామని, గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలివ్వాలని అనుకుంటున్నా కేంద్రం అడ్డు పడుతోందని, ఎన్నికల తర్వాత దాని కోసం కేంద్రంతో పోరాడుతామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బుధవారం కుమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. పోడు రైతులకు పట్టాలివ్వడమే కాకుండా వారికి రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. గత పదేండ్లుగా అధికారంలో ఉండి గత ప్రభుత్వాలు చేయని ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చేసి చూపించామన్నారు. 24 గంటల కరెంట్‌ అవసరం లేదని, ధరణిని తీసి బంగాళాఖాతంలో వేయాలని కాంగ్రెసోళ్లు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిని తీసేస్తే మళ్లీ పైరవీకారుల వ్యవస్ధ వస్తుందన్నారు. 30న జరిగే ఎన్నికల్లో అభ్యర్థి గుణగణాలతో పాటు ఆ అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్ర తెలుసుకొని ఓటేయాలని సూచించారు. పీసీసీ అధ్యక్షులు టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్‌ పార్టీ నేతలే లొల్లి పెడుతున్నారని, అలాంటి వారికి రాష్ట్రాన్ని అప్పగిస్తే రేపటి పరిస్ధితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు.
ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షల ఖర్చు
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 1019 గురుకులాలు ఏర్పాటు చేసి, ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.1.25లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. మైనార్టీల అభివృద్ధికి కూడా అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. గడిచిన పదేండ్లలో రూ.12వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో 93లక్షల తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యంతో పాటు త్వరలో బీమా సదుపాయం కల్పించనున్నట్టు తెలిపారు. గతంలో వానాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అని పత్రికల్లో వచ్చేదని, ఇప్పుడు ఆసిఫాబాద్‌లో మెడికల్‌ కాలేజీ, వంద పడకలతో ఆస్పత్రి వచ్చాయని తెలిపారు. జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదంతో పోరాడిన కుమురం భీం జిల్లాకు పెట్టుకున్నామని తెలిపారు. చెన్నూరులో చెల్లని రూపాయి, బెల్లంపల్లిలో చెల్లుతుందా అని కాంగ్రెస్‌ అభ్యర్థిపై వ్యంగాస్త్రాలు సంధించారు.
మొరాయించిన హెలికాఫ్టర్‌.. బస్సులో ఆసిఫాబాద్‌కు..
కాగజ్‌నగర్‌ సభ అనంతరం సీఎం కేసీఆర్‌ ఆసిఫాబాద్‌కు బయలుదేరేందుకు హెలికాఫ్టర్‌ మొరాయించింది. సీఎం కూర్చున్న తర్వాత హెలిక్యాప్టర్‌ మొరాయించడంతో దిగి రోడ్డు మార్గంలో బస్సులో ఆసిఫాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. సాంకేతికలోపాన్ని సవరించిన అనంతరం హెలికాఫ్టర్‌ ఆసిఫాబాద్‌కు బయల్దేరింది. బహిరంగ సభల్లో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మెన్‌ రాథోడ్‌ జనార్ధన్‌, మాజీ ఎంపీ గొడం నగేష్‌ పాల్గొన్నారు.

Spread the love