Saturday, June 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆస్తుల పేరిట క్యూబాపై అమెరికా ఒత్తిడి

ఆస్తుల పేరిట క్యూబాపై అమెరికా ఒత్తిడి

- Advertisement -

ఆరు దశాబ్దాలు ఆంక్షలతో నష్టపర్చిన వాషింగ్టన్‌ ఇప్పుడు మరోసారి బిలియన్‌ డాలర్ల డిమాండ్‌

హవానా, వాషింగ్టన్‌ : క్యూబా విప్లవం తర్వాత జాతీయీకరించిన ఆస్తులపై క్యూబా-అమెరికా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. అమెరికా పౌరులు, కంపెనీలు తమకు చెందిన ఆస్తులను క్యూబా ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని పేర్కొంటూ ప్రస్తుతం 9 బిలియన్‌ డాలర్లకు పైగా పరిహారం డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, క్యూబాపై 70 ఏండ్లుగా కొనసాగుతున్న ఆర్థిక దిగ్బంధనమే ద్వీప దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని క్యూబా వర్గాలు వాదిస్తున్నాయి.

ట్రంప్‌ ప్రభుత్వ వైఖరి
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. క్యూబాపై కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు. అమెరికా విదేశాంగ శాఖలో కూడా క్యూబన్‌-అమెరికన్‌ వర్గాలకు చెందిన ప్రముఖులు కీలక స్థానాల్లో ఉండటంతో క్యూబాపై ఒత్తిడి మరింత పెంచొచ్చని శక్తివంతమైన వర్గాలు భావిస్తున్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల క్యూబా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించిన ఒక కేసు విచారణకు అనుమతించడం కూడా ఇదే దిశగా మరో అడుగుగా భావిస్తున్నారు.

‘ఆస్తుల కంటే రాజకీయ లక్ష్యాలే ఎక్కువ’
కొంత మంది నిపుణుల ప్రకారం.. ఈ డిమాండ్లు కేవలం ఆస్తుల పునరుద్ధరణ కోసమే కావనీ, విప్లవానికి ముందు ఉన్న సామాజిక, ఆర్థిక వ్యవస్థను తీసుకురావాలనే కోరిక కూడా కనిపిస్తోందని చెప్తున్నారు. విప్లవానికి ముందు భూస్వామ్య వర్గాలు, వ్యాపార కుటుంబాలు క్యూబా దేశ ఆర్థిక వ్యవస్థపై అపారమైన ఆధిపత్యం కలిగి ఉండేవి. దీంతో ఇప్పుడు అదే స్థితిని పునరుద్ధరించాలన్న ఆకాంక్ష ఈ ఉద్యమం వెనుక ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు.}

భారీ నష్టపరిహారం చెల్లించాలంటున్న క్యూబా
అమెరికా.. ఆస్తులపై పరిహారం కోరుతున్నట్టే.. క్యూబా కూడా అమెరికాపై భారీ నష్టపరిహారం డిమాండ్‌ చేస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్థిక దిగ్బంధనం వల్ల సుమారు 170 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని క్యూబా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేస్తోంది. అలాగే అమెరికా మద్దతుతో కొనసాగుతున్న క్యూబా వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రదాడుల వల్ల కూడా తీవ్ర నష్టం జరిగిందని క్యూబా వాదిస్తోంది.

అమెరికా ఆంక్షల ఆరంభం
క్యూబాలోని అమెరికా కంపెనీలకు చెందిన చమురు శుద్ధి కర్మాగారాలు, చక్కెర మిల్లులు, బ్యాంకులను జాతీయీకరించిన తర్వాత వాషింగ్టన్‌ తీవ్రంగా స్పందించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్‌ డి. ఐసన్‌హౌవర్‌ క్యూబాపై వాణిజ్య ఆంక్షలు విధించారు. అప్పటి నుంచి దాదాపు 70 ఏండ్లుగా వివిధ రూపాల్లో అమెరికా ఆర్థిక దిగ్బంధనం కొనసాగుతోంది. అయితే ఈ ఆంక్షల వల్ల దేశానికి వందల బిలియన్‌ డాలర్ల నష్టం జరిగిందని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు.

విప్లవం తర్వాత జాతీయీకరణ
1959లో ఫిడెల్‌ క్యాస్ట్రో నేతృత్వంలోని విప్లవం తర్వాత క్యూబాలో భూసంస్కరణలు చేపట్టారు. అప్పటి వరకు కొద్ది మంది భూస్వాములు, విదేశీ కంపెనీల చేతుల్లో కేంద్రీకృతమైన భూములు, పరిశ్రమలను ప్రభుత్వం జాతీయీకరించింది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. అప్పటి క్యూబాలో గ్రామీణ పేదరికం తీవ్రంగా ఉండేది. భూమి యాజమాన్యం కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండటంతో భూసంస్కర ణలు సామాజిక అవసరంగా మారాయి.

తొమ్మిది బిలియన్‌ డాలర్ల వివాదం
అమెరికా లెక్కల ప్రకారం.. క్యూబాలో జాతీయీకరించిన ఆస్తులకు సంబంధించి దాదాపు 6,000 క్లెయిమ్‌లు నమోదయ్యాయి. అప్పట్లో వాటి విలువ 1.9 బిలియన్‌ డాలర్లు కాగా.. వడ్డీతో కలిపి ప్రస్తుతం తొమ్మిది బిలియన్‌ డాలర్లకు పైగా చేరుకుంది. దీంతో అమెరికాలోని కొన్ని శక్తివంతమైన వర్గాలు ఈ అంశాన్ని మళ్లీ ముందుకు తెస్తున్నాయి.

ఆర్థికంగా పరిహారం అసాధ్యమే
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్యూబా తొమ్మిది బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించడం వాస్తవానికి అసాధ్యమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశం నుంచి ఇంత భారం ఆశించడం ఆచరణ సాధ్యం, సబబు కాదని వారు చెప్తున్నారు. క్యూబా విప్లవం తర్వాత జాతీయీకరించిన ఆస్తుల వివాదం కేవలం ఆస్తుల సమస్య మాత్రమే కాదనీ, అది చరిత్ర, రాజకీయాలు, ఆర్థిక ఆంక్షలు, సార్వభౌమాధికారానికి సంబంధించిన సంక్లిష్ట అంశమని పరిశీలకులు చెప్తున్నారు. అమెరికా ఆస్తులపై పరిహారం కోరుతుండగా, క్యూబా మాత్రం దశాబ్దాల ఆంక్షల వల్ల జరిగిన నష్టానికి జవాబు కోరుతోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య వివాదం త్వరలో ముగిసే అవకాశాలు కనిపించడంలేదని విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -