Saturday, June 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంక్యూబా అధ్యక్షుడు డియాజ్‌-కానెల్‌పై అమెరికా ఆంక్షలు

క్యూబా అధ్యక్షుడు డియాజ్‌-కానెల్‌పై అమెరికా ఆంక్షలు

- Advertisement -

హవానాపై మరింత
ఒత్తిడి పెంచిన ట్రంప్‌
క్యూబా సైన్య మంత్రిత్వ శాఖ
సహా ఐదు సంస్థలు,
నలుగురు వ్యక్తులు కూడా టార్గెట్‌


వాషింగ్టన్‌, హవానా : క్యూబాపై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా అమెరికా.. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్‌ డియాజ్‌-కానెల్‌పై ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆయనతో పాటు మరో నలుగురు వ్యక్తులు, ఐదు సంస్థలను కూడా ఆంక్షల జాబితాలో చేర్చింది. ఈ చర్యతో హవానాపై వాషింగ్టన్‌ ఒత్తిడి మరింత తీవ్రతరమైందని పరిశీలకులు చెప్తున్నారు.
అధ్యక్షుడితో పాటు కీలక సంస్థలపై చర్యలు అమెరికా ట్రెజరీ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం… అధ్యక్షుడు డియాజ్‌-కానెల్‌తో పాటు మరికొందరు క్యూబా అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించారు. ఆంక్షలకు గురైన సంస్థల్లో క్యూబా విప్లవ సాయుధ దళాల మంత్రిత్వ శాఖ కూడా ఉంది. 66 ఏండ్ల డియాజ్‌-కానెల్‌ 2018లో అధికారంలోకి వచ్చారు. ఆయన క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్‌ క్యాస్ట్రో నుంచి బాధ్యతలు స్వీకరించారు. కాగా క్యూబా కమ్యూనిస్టు నాయకత్వంపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా చేపడుతున్న చర్యల్లో భాగంగానే తాజా ఆంక్షలను విశ్లేషకులు చూస్తున్నారు.

ఆంక్షల ప్రకటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ… ‘క్యూబా ఒక సరైన దేశంగా ఉండాలని అమెరికా కోరుకుంటోంది’ అని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్‌ మాటల వెనుకు ఆంతర్యం వేరననీ, క్యూబాను తన చేతుల్లోకి తెచ్చుకోవాలని ఆయన ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. గతనెలలో కూడా అమెరికా ప్రభుత్వం క్యూబాకు చెందిన 11 మంది అధికారులపై ఆంక్షలు విధించింది. వీరిలో కమ్యూనికేషన్స్‌ మంత్రి, పలువురు సైనికాధికారులు, క్యూబా ప్రధాన నిఘా సంస్థకు చెందిన అధికారులు ఉన్నారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం రౌల్‌క్యాస్ట్రోపై హత్య ఆరోపణలు కూడా మోపింది. 1996లో క్యూబన్‌ యుద్ధ విమానాలు, అమెరికాలోని క్యూబన్‌ ప్రవాసుల బృందం నిర్వహిస్తున్న విమానాలను కూల్చివేసిన ఘటనలో ఆయన ప్రమేయం ఉందని ఆరోపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -