యూడీఎఫ్ శ్వేతపత్రంపై మాజీమంత్రి థామస్ ఐజాక్ తీవ్ర విమర్శలు
తిరువనంతపురం: యూడీఎఫ్ ప్రభుత్వ కొత్త ఆర్థిక విధానం , శ్వేతపత్రం కేరళంను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి డాక్టర్ టి.ఎం. థామస్ ఐజాక్ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో యూడీఎఫ్ ప్రభుత్వం ప్రకటించిన ‘ఇందిరా గ్యారెంటీ’ పథకాలు ఏవీ అమలుకు నోచుకునే అవకాశం లేదని, అలాగే రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన వేగం తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. శ్వేతపత్రంలో ప్రతిపాదించిన కొన్ని ఆందోళనకరమైన విధానాలపై ఐజాక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేండ్ల కు ఒకసారి జరగాల్సిన వేతన సవరణలను పదేండ్లకు ఒకసారికి మార్చడం, పెన్షన్ వయోపరిమితిని పెంచడం, సంక్షేమ పెన్షన్లను లబ్దిదారుల ఇండ్లకు చేరవేసే విధానాన్ని రద్దు చేసి, వారు స్వయంగా బ్యాంకులకు వెళ్లి తీసుకునేలా చేయడం (దీనివల్ల అనేక సంక్షేమ పథకాలు దెబ్బతింటాయి), అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడే పరిస్థితి రావడం వంటివి ఇందులో ఉన్నాయని అన్నారు.
కేరళం భారీ తిరోగమనం వైపు పయనిస్తోంది” అని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వీ.డీ. సతీశన్ హామీ ఇచ్చిన ఆదాయ సమీకరణ చర్యలు ఏవీ ఈ శ్వేతపత్రంలో లేవని ఐజాక్ గుర్తుచేశారు. వీటిలో రూ. 25 వేల కోట్ల ఆదాయ బకాయిల వసూలు, బంగారంపై జీఎస్టీ ద్వారా రూ. 15 వేల కోట్ల సేకరణ, మొదటి ఐదేండ్ల లోనే రూ. 20 వేల కోట్లకు పైగా అంచనా వేసిన ఐజీఎస్టీ లీకేజీలు అరికట్టడం వంటివి ఉన్నాయని తెలిపారు. ‘కేరళం పట్ల కేంద్రం చూపుతున్న తీవ్ర వివక్ష ’ అసలు కారణాన్ని గుర్తించకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యమే కారణమని శ్వేతపత్రం చిత్రీకరిం చిందని థామస్ ఐజాక్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు కేంద్రం నుంచి సగటున 50 శాతం ఆదాయ వాటా లభిస్తుండగా, గతేడాది కేరళంకు కేంద్ర బదిలీల ద్వారా మొత్తం ఆదాయంలో కేవలం 25 శాతం మాత్రమే లభించిందని పేర్కొన్నారు. మొత్తం కేంద్ర గ్రాంట్లు , కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులలో కేరళం వాటా కేవలం 1.9 శాతం మాత్రమే ఉందని తెలిపారు. శ్వేతపత్రంలో దీని గురించి నామమాత్రంగానే ప్రస్తావిం చారని, కేంద్రంపై ఎలాంటి విమర్శలు చేయలేదని అన్నారు. కేంద్రం చూపే నిర్లక్ష్యం పై ప్రశ్నించేందుకు యూడీఎఫ్ ఎప్పుడూ వెనుకాడుతుందనడానికి ఇది మరో నిదర్శ నమని చెప్పారు.
కేఐఐఎఫ్‌బీ మార్పు సరికాదు
ప్రభుత్వ శాఖ పరిధిలోకి కేరళం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్ (కేఐఐఎఫ్ బీ)ను మార్చడం వల్ల దాని ఉనికికే అర్థం లేకుండా పోతుందని ఐజాక్ అన్నారు. సాధారణ బడ్జెట్ విధానాల ద్వారా పావు శతాబ్దం పట్టే పనులను ఈ సంస్థ అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసిందని ఆయన దానిని సమర్థించారు. కేఐఐఎఫ్ బీ తీసుకున్న రుణాలను రాష్ట్ర రుణ పరిమితి పరిధిలోకి చేర్చా లన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిం చినందుకు ఆయన ఆ శ్వేతపత్రాన్ని విమర్శిం చారు. వాస్తవానికి కాగ్ ఈ విషయాన్ని ఎత్తి చూపకముందే సతీశన్ స్వయంగా అసెంబ్లీలో ఇదే వైఖరిని సమర్థించారు. అలాగే, రాష్ట్ర రుణ భారంపై ఆ శ్వేతపత్రం సృష్టించిన ఆందోళనను కూడా ఆయన తోసిపుచ్చారు.



