కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణది కనిష్ట స్థాయి
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు
24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి
తగిన నిధులు కేటాయించి పనులను పూర్తి చేయాలి :
సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ
నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర ప్రమాదం ఏర్పడిందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకుండా జల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుక్రవారం హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో ఈ ఏడాది ఏప్రిల్ ఏడున లేఖ రూపంలో బీఆర్‌ఎస్ చేసిన హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. అందువల్లే పంపులు దెబ్బతిని, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చెందిందని విమర్శించారు. తెలంగాణ జల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని పేర్కొన్నారు. కృష్ణా జలాల వినియోగంలో చారిత్రక కనిష్ట స్థాయికి తెలంగాణ దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ 74.90 శాతం వినియోగిస్తే, తెలంగాణ 25.10 శాతానికి పరిమితం అయ్యిందని వివరించారు. రైతులు, తాగునీటి అవసరాలు, పరిశ్రమల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందని తెలిపారు. సోలార్ ఆధారిత విద్యుత్ విధానాలతో సాగునీటి రంగానికి ముప్పు అని పేర్కొన్నారు. అందుకే రైతు డిస్కం ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం, దేవాదుల నిర్వహణకు తగిన నిధులు కేటాయించి పనులను పూర్తి చేయాలని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల పూర్తి వినియోగం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి తదితర రంగాలకు తగిన నీటి లభ్యతను నిర్ధారించాలని కోరారు.
జల హక్కులను కాపాడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



