ఇండ్లు, ఇండ్ల స్థలాలు సాధించుకోవాలి
సీపీఐ(ఎం) అభ్యర్థికి మద్దతుగా ఇబ్రహీంపట్నంలో డీజీ ప్రచారం
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు డీజీ నర్సింహారావు పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ 12వ వార్డులో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి సామెల్ తరపున సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ముందుగా పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పాషా నరహరి స్మారక కేంద్రం నుంచి ప్రారంభమైన ప్రచార ర్యాలీ వార్డులోని వీధులు తిరుగుతూ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి సామెల్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డీజీ మాట్లాడుతూ.. 12వ వార్డులో ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్లే పని చేశారని, ఎందుకు సమస్యలు పరిష్కారం చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇల్లు, భూమి, విద్య, వైద్యం కోసం నిరంతర ఉద్యమాలు తాము కొనసాగిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల హక్కుల కోసం నిలబడతామని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే కుట్రలు చేస్తుందన్నారు. వీటిని దెబ్బ కొట్టాలంటే ప్రజా ఉద్యమాలు బలపడాలని, అందుకు తమకు మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు.



