నవతెలంగాణ అచ్చంపేట
అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవిధంగా అధికారులు కృషి చేయాలని, వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశించారు. శనివారం ఉదయం అచ్చంపేటలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఈ క్రమంలో పట్టణంలోని వార్డుల్లో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
పట్టణంలోని శానిటేషన్ పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణం పరిశుభ్రంగా ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ పారిశుధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, డ్రైనేజ్ పనులను అధికారులు నిర్లక్ష్యం చేయవద్దు అన్నారు.

అనంతరం పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణాల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులు త్వరగా ఇళ్లలోకి వెళ్లేలా పనులను వేగవంతంగా పనులను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని, లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సహాయం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని అన్నారు.
తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో నిల్వ ఉన్న మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, ఆసుపత్రి పరిశుభ్రత, మందుల వ్యాలిడిటీ తదితర అంశాలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, పాముకాటు, కుక్కకాటుల మందులతో పాటు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. రోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సేవలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వైద్యులు తప్పనిసరిగా ఆసుపత్రులకు సమయపాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ యాదగిరి, మున్సిపల్ కమిషనర్ మురళి, తాసిల్దార్ సైదులు ఉన్నారు.




