Sunday, June 7, 2026
E-PAPER
Homeకథచెప్పుటుంగటం తెగింది…

చెప్పుటుంగటం తెగింది…

- Advertisement -

శివ బయటకు వస్తూంటే కాలికేదో రాయి తగిలి, చెప్పుటుంగటం తెగిందని.. ”ఛీ దీనమ్మ ఇప్పుడే తెగాలా… ఈరిగాడికి చెప్పులు కుట్టడం రాదా… లం..కొడుకు” అని కోపంగా చెప్పులు విసిరేసిన కొడుకును చూసి
”ఏమైందరా శివా! అలా నోరు పారేసుకుంటున్నావ్‌” కాస్త మందలింపుగానే సరోజ అన్నది.
”లేకపోతే ఏంటమ్మా… పదిరోజులు కాలేదు. తెగిచచ్చిందీ చెప్పు. వెధవకి పనిమీద శ్రద్ధలేదు కాని ఈనాములు, పండగ మామూళ్ళు కావాలి. బలిసింది వాడికి” హెచ్చు స్వరంతో అన్నాడు.
”ఇంటి పనోడినలా తిట్టమాకురా శివా. కళ్ళు పోతారు. నువ్వు పుట్టకముందునుండి మనల్నే నమ్ముకుని బతుకుతున్న బక్క జీవిరా వాడు. జీతగాళ్ళు ఇద్దరు మారినా, మనల్నే నమ్ముకున్న విశ్వాసంరా వాడిది. వాళ్ళ తాత, నాన్న అదే విధంగా చాకిరి చేసి, మంచిపేరు తెచ్చుకున్నారురా”

”సరే.. ఇప్పుడేమంటావ్‌….?”
”ఏముంది ఇంకో జత వున్నాయిగా. వేసుకుని పొలంకేసే వెడతావు కాబట్టి అక్కడే ఈరయ్యుంటాడాయె. చెప్పు తెగిందని చెప్పు, వాడే వచ్చి పట్టుకెళ్ళి సరిచేసి తెస్తాడు. ఈ మాత్రం దానికి వాడినలా చులకన చేయాలా” గట్టిగా క్లాసు పీకింది సరోజమ్మ కొడుకుని.
”తప్పుతుందా” అంటూ అమ్మ మాట పాటించి పొలం వెళ్ళాడు శివ.
వరికుప్పలు కొడుతున్నారు. తూర్పారబోయడం, కొంత ధాన్యం బస్తాలకెక్కించడం, కొంత విడిగా ట్రాక్టర్‌తో ఇంటికి తేవడం, గాదెలో నింపడం వగైరా… పనులు జరుగుతున్నాయి.

ఈ కుటుంబం ఎగువ మధ్యతరగతికి చెందినా, కాస్త అభ్యుదయ నేపధ్యం కలిగివుంది. ఊరికి పట్వారిగిరి చేస్తున్నా, దానితో పాటు ఊరి పటేలుగా కూడ పేరుపొందిన వ్యక్తి రంగనాథం గారు. వారి పెండ్లామే ఈ సరోజమ్మ. శివ ఒక్కడే కొడుకు. తరువాత లక్ష్మీ ఒక్కతే కూతురు. ఇది వీరి కుటుంబం. సంప్రదాయంతోబాటు సామాజిక స్పహ కలిగిన నేపథ్యం కలవాళ్ళు. ఊరిలో చిన్నాచితక అన్ని కులాలవారు కలిపితే రెండు వేల జనాభా. ఊరి సర్పంచి కష్ణయ్య వెనుకబడిన తరగతికి చెందిన పూజగొల్ల కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు.. కాస్తోకూస్తో పొలం గట్రా వుంది. ఇంటర్మీడియట్‌ వరకు చదుకున్నాడు. వామపక్ష భావాలున్నవాడు. ఊరికి మేలు చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని సంక్షేమ పథకాలు రాబట్టుతుంటాడు. రెండు సార్లు ఉత్తమ సర్పంచి అవార్డు పొందాడు. అదీ రెండు పార్టీల పాలనలో తలొకసారి. తలలో నాలుకగా మెసలడమే అతగాడి ప్రవృత్తి.

ఓ రాత్రి ఎనిమిది గంటల సమయంలో రంగనాథం గారితో ముచ్చటించడానికి వచ్చినట్టున్నాడు.
”కర్ణంగారూ.. వున్నారా”.. అంటూ గుమ్మంలోకి రాగానే.
” రావయ్యా కృష్ణా” అంటూ ఆహ్వానిస్తూ…
”సరోజా మంచినీళ్ళతోపాటు ఇందాక చేసిన జున్ను ముక్క పట్టుకురా…” అని ఆర్డరు వేసాడు.
ఇంతలో లోపలినుండి శివ వస్తూ ”ఏం సర్పంచ్‌ గారు యెలా వున్నారు”
”బ్రహ్మాండంగా వున్నాను. ఐనా మనం ఒకే ఈడువాళ్ళం.. గారూ అంటావేంరా శివా”
”నీ హోదాకి.. కాని నీకు కాదులేరా” అంటుండగా, మంచినీళ్ళతోపాటు జున్ను తెచ్చి ఇచ్చింది సరోజ.
”జున్నా.. ఎప్పుడు చేసావమ్మా”.. అన్నాడు శివ.
”ఈ మధ్యాహ్నం… చిన్నమ్మ వాళ్ళ గేదె ఈనిందని పాలు పంపితే చేసాను..” అంటూ శివకు కూడా ఇచ్చింది సరోజ.
”జున్ను బాగా కుదిరిందమ్మా… ఈ పూటపాలేనా.. అన్నట్టు గేడీరిగాడికి, అదే ఈరయ్యకు చెప్పాను పొలందగ్గర.

చెప్పులు తీస్కపోయాడా” అన్నాడు శివ.
”ఆ. ఆ.. తీసుకెళ్ళాడు. పొద్దున్నే వచ్చేటప్పుడు ఇచ్చిపోతానన్నాడురా” అంది సరోజ.
ఊళ్ళో సంగతులు, చేయాల్సిన పనులు, పట్నం వెడితే కలవాల్సిన ఆఫీసులు… కబుర్లు ఎన్నో దొర్లాయి…
”అన్నట్టు శివా… ఈరయ్యంటే నీకేదో కోపం వున్నట్టుంది. ఇందాక నాలుక కరచుకొని ఈరయ్యన్నావు.. నీకు గుర్తులేదేమో. చిన్నప్పుడు తను కూడ మనతో మామిడి తోటలో ఆడుకోటానికి వచ్చేవాడు. ఒకసారి కాలుజారి మోటబావిలో నువ్వు పడ్డప్పుడు మేమంతా బిక్కమొగాలేసుకుని కంగారు పడుతుంటే…. ఈరయ్య వెనుకా ముందూ చూడకుండా… మోటకున్న పగ్గం తన నడుముకి చుట్టుకుని బావిలోకి దూకి పగ్గం నీకు కట్టి, పైకి వచ్చేందుకు వున్న మెట్టు వద్దకు చేర్చి, తను వడిగా పైకి వచ్చి మోట బొక్కెన బావిలోకి వేసాడు. మేము పట్టుకుని వుంటే బావిలోకి దిగి నిన్ను బొక్కెనలో కూచోపెట్టి పగ్గం కట్టి మమ్మల్ని బొక్కెన పైకిలాగమంటే మన వాళ్ళు రాజా, గోపీలు కాడె భుజాన వేసుకుని… ఎడ్లు మోటలాగినట్టు లాగితే బయటకు నేను తీసాను. ఆ రోజు ఈరయ్య లేకపోతే… నువ్వు దక్కేవాడివి కావురా…” అంటూ కృష్ణ గతాన్ని చెబుతుంటే.. శివ ఒక్కసారి షాకై.. తేరుకుని కష్ణని కౌగలించుకొని భోరున ఏడ్చేసాడు.
”తర్వాత మాకు భయమేసింది.. ఈరయ్య చేత్తో ముట్టుకుని నిన్ను రక్షించిన సంగతి వల్ల పెద్ద గొడవ జరుగుతుందనుకున్నాం. ఆ రోజులు అటువంటి కట్టుబాట్లు వుండేవికదా.
కాని మీ నాన్నగారు సర్దిచెప్పిన పిదప, మిగతా పెద్దలు కూడ నిజం తెలుసుకుని, ఆపదలో ఆదుకున్నవారెవరైనా భగవత్వ్సరూపులే అనే వాళ్ళ నమ్మకంతో అంతా సుఖాంతమైంది…” అన్నాడు కృష్ణ.
”నిజమా.. నమ్మశక్యం కాకపోయినా… నువ్వు చెప్పావంటే చచ్చినట్టు సత్యమే” అన్నాడు శివ. ఆనందంగా మరోమారు కౌగలించుకొన్నాడు కృష్ణని.
వెళ్ళొస్తానంటూ సెలవు తీసుకున్నాడు సర్పంచ్‌ కృష్ణ.

రాత్రి భోజనాలైన తరువాత… కొబ్బరి చెట్టుకింద వెన్నెలలో మడత మంచంమీద పడుకుని….ఆలోచిస్తూ… ‘చెప్పుటుంగటం తెగబట్టేకదా, నేను ఆవేశంగా ఈరయ్యను చులకనగా ఈరిగాడనటం, అమ్మ మందలించడం జరిగింది. మోటబావిలో నేను పడడం, ఈరయ్య కాపాడిన సంగతి కష్ణ వివరంగా చెప్పి, నా కళ్ళు తెరిపించిన సంఘటన..నా మీద నాకే అసహ్యం వేసినా, వాస్తవం తెలిసింది కాబట్టి, ఉదయాన్నే ఈరయ్య వచ్చినవెంటనే ఏ భేషజం లేకుండ క్షమించమని అడగాల్సిందే…’ జరిగిందంతా మననం చేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు శివ.

ఊరుమ్మడి గద్దె వద్ద సభలో ”జంతువుల మత కళేబరాన్ని, దుర్వాసన వస్తున్నా వాటిని ఊరికి దూరంగా తీసుకెళ్ళి, చర్మాన్ని వేరుచేసి ఎంతో ఓపికగా, నైపుణ్యంతో నీటిలో నానబెట్ఞడం, ఉప్పు పసుపుతో తోలును శుభ్రం చేయడం, వెంట్రుకలు పోయేలా పదునైన కత్తితో, తోలు తెగకుండా చిత్రీపట్టడం… ఎండ బెట్టడం, చెడు వాసన రాకుండా చర్యలు తీసుకోడం, మెత్తగా, తయారు చేసి ఇటు చెప్పులు కుట్టడానికైనా, వ్యవసాయానికి పనికివచ్చే మోట బొక్కెనకు తొండం చేయడానికైనా… చర్మకారుడు పడే కష్టం, నిబద్ధత, గుర్తించాలి కాని తూలనాడకూడదు. మనతో సమానంగా చదువు సంధ్యలు అబ్బేలా చేయడానికి మనం కృషి చేయాల్సిందే. అందుకు నేనెల్లపుడు మీకు అందుబాటులో వుంటానని, ఈ ఊరి సర్పంచిగా ప్రమాణం చేసిన ఈ రోజే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ అరుంధతి వాడకు వచ్చినందుకు చాలా సంతోషం. అందుకు విశేష కషి చేసిన మన వూరి, ఇనపనూరి ఈరయ్యను ఘనంగా సన్మానించుకుందాం. ఆ పని సర్పంచి కృష్ణ నిర్వహించాలని కోరుకుంటు సెలవు తీసుకుంటాను… ఈరయ్య, వేదిక మీదకు రావాలి.కృష్ణ ఇక మిగతా పని నీకే.. ధన్యవాదాలు” అని శివ వేదిక మీద కూర్చుంటాడు.

సభంతా చప్పట్లు మారుమోగుతుంటాయి…
ఉదయపు సూర్యుని లేతకిరణాల స్పర్శకి నిద్ర లేస్తాడు శివ. గబగబా తన చెప్పులకేసి చూస్తాడు… చెప్పుటుంగటం తెగింది, రాయి తగిలికాదు… కుక్క కొరకడంవల్ల… అదుగో తిడతారని బిక్కమొగమోసుకుని దూరంగా వరండాలో కూచుంది వాళ్ళ నల్ల కుక్క జిమ్మీ. తనలో తాను తన తొందరపాటుకు సిగ్గుపడుతూ, వేపపుల్ల నోట్లో పెట్టుకుని బావి దగ్గరకు వెళ్ళాడు శివ.

కపిల రాంకుమార్ 9849535033



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -