నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
వార్షిక తనిఖీల్లో భాగంగా సిరికొండ పోలీస్ స్టేషన్ను ఉట్నూర్ ఎఎస్పి రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ పరిశీలించారు. ముందుగా ఎస్ఐ విక్రమ్ పూల మొక్క అందజేసి ఆహ్వానించారు, అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది ద్వారా ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాల స్థితిగతులపై ఆరా తీశారు. పోలీసు యూనిఫాం గొప్పతనాన్ని తెలియజేశారు. పోలీస్ స్టేషన్ సిబ్బందికి కేటాయించిన వస్తువులను వారి సర్వీస్ రికార్డులను పరిశీలించారు. ఎఎస్పి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. మండల పరిధిలో మండల పరిధిలో ప్రజలతో సత్సంబంధాలను ఏర్పరచుకోవాలని గ్రామాలను సందర్శిస్తూ ఉండాలని తెలిపారు.
గంజాయి గుడుంబా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించాలని గంజాయి వల్ల భవిష్యత్తు నాశనం అవుతుందనే విషయాన్ని తెలియజేసి చైతన్య పరచాలని సూచించారు. ప్రజలలో పోలీసుల పట్ల ఉన్న గౌరవాన్ని నమ్మకాన్ని పెంచే విధంగా దర్యాప్తులను చేపట్టి, పోలీస్ స్టేషన్ లో ఎలాంటి పెండెన్సీ లేకుండా రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ బాధితుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా సిబ్బందిని కేటాయిస్తూ వారికి శాశ్వత పరిష్కారం చూపించాలని తెలిపారు.
సిబ్బంది మంచి ప్రవర్తన, క్రమశిక్షణను కలిగి ఉండాలని నిధులలో నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు. చిన్న చిన్న నేరాలు జరిగినప్పుడే వాటిని అరికట్టాలని సూచించారు. మహిళల పట్ల వేధింపులపై చిన్నారుల పట్ల జరుగు నేరాలపై బాల్యవివాహాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాటిని అరికట్టే దిశగా కృషి చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ రౌడీషీటర్లను, సస్పెక్ట్ షీట్లను తరచూ తనిఖీ చేస్తూ ఉండాలని, వారి స్థితిగతులను తెలుసుకుంటూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడా సీఐ సిహెచ్ రమేష్, ఎస్సై విక్రం సిబ్బంది. పాల్గొన్నారు.



