Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాల లో పోలింగ్ ప్రశాంతం

పరకాల లో పోలింగ్ ప్రశాంతం

- Advertisement -

 22 వార్డులకు పోలింగ్ నిర్వహణ
 పోలింగ్ 80.16 శాతం నమోదు
 హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్
 పరకాల లోని పలు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళీని పరిశీలించిన జిల్లా కలెక్టర్
నవతెలంగాణ -పరకాల 
:- పరకాల మున్సిపాలిటీ లో 22 వార్డు స్థానాలకు గాను బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 44 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగింది. ఆయా వార్డుల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డు స్థానాలకు గాను 44 పోలింగ్ కేంద్రాలలో  నిర్వహించిన పోలింగ్  ప్రశాంతంగా సాగినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. పోలింగ్ 80.16 శాతం నమోదయినట్లు పేర్కొన్నారు.  మున్సిపాలిటీ 13 వార్డులను సమస్యాత్మకంగా గుర్తించామని, వీటి పరిధిలో 26 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు మైక్రో అబ్జర్వర్లు నియమించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో వంద శాతం వెబ్ కాస్టింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 26,784 ఓటర్లు ఉండగా 21469 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. ఉదయం 9 గంటల వరకు 2589 ఓటర్లు ఓటు వేయగా  (9.67 శాతం), ఉదయం 11 గంటల వరకు 5904 మంది ఓటర్లు (22.04 శాతం), మధ్యాహ్నం ఒంటిగంట వరకు 14333 మంది ఓటర్లు(53.51 శాతం), మధ్యాహ్నం 3 గంటల వరకు 18789 ఓటర్లు ( 70.15శాతం ), సాయంత్రం ఐదు గంటల వరకు 21469 ఓటర్లు ఓటు వేయగా పోలింగ్ 80.16 శాతంగా నమోదయింది. 

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్
 పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. వెలమవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో (మూడో వార్డు)ఆరో పోలింగ్ కేంద్రాన్ని.. మోడల్ పోలింగ్ కేంద్రంగా అధికారులు ఏర్పాటు చేయగా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ ఎన్.రవి పరిశీలించారు. మోడల్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళీని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రాజిపేటలోని ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటుచేసిన 11, 12 పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ సందర్శించారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో కొనసాగిన పోలింగ్ ప్రక్రియ గురించి కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సలహాలు సూచనలు చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పరకాల మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ తో పాటు పరకాల ఆర్డీవో డాక్టర్ కన్నం నారాయణ, పరకాల మున్సిపాలిటీ కమిషనర్ అంజయ్య, తహసీల్దార్  విజయలక్ష్మి, ఎంపిడీవో రవీందర్, ఇతర అధికారులు ఉన్నారు. 

 పోలింగ్ సరళీని పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకులు శివ కుమార్ నాయుడు
 రెండో సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా పరకాలలో పోలింగ్ ప్రక్రియ ను జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు కె. శివకుమార్ నాయుడు పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లోని పోలింగ్ కేంద్రాలు, ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళీని ఎన్నికల పరిశీలకులు శివకుమార్ నాయుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 స్ట్రాంగ్ రూమ్ కు బ్యాలెట్ బాక్స్ లు, పోలింగ్ సామగ్రి తరలింపు
 పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని పరకాల లోని గణపతి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ కు పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య  అధికారులు తరలించారు. 22 వార్డుల సంబంధించి 44 పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో ఎన్నికల సిబ్బంది స్ట్రాంగ్ రూమ్ నకు చేరుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడే ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద  ఈనెల 13వ తేదీన  ఓట్ల లెక్కింపు జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -