Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్పొరేట్‌ సంస్థల కోసమే వాణిజ్య ఒప్పందం

కార్పొరేట్‌ సంస్థల కోసమే వాణిజ్య ఒప్పందం

- Advertisement -

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌
పంటల మార్పిడికి ప్రత్యేక విధానం రావాలి : 
రాష్ట్ర రైతు కమిషన్‌ సభ్యులు 
రాంరెడ్డి గోపాల్‌ రెడ్డి


నవతెలంగాణ-కామేపల్లి

పంటల మార్పిడి కోసం ప్రత్యేక విధానం తీసుకురావాలని, ఆ పంటలకు మద్దతు ధర కల్పించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌, రాష్ట్ర అగ్రికల్చర్‌ కమిషన్‌ డైరెక్టర్‌ రాంరెడ్డి గోపాల్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా శిక్షణా తరగతుల ప్రారంభ సభ సోమవారం కామేపల్లి మండలం లింగాల క్రాస్‌ రోడ్‌లోని మేకల ధనలక్ష్మి హాల్‌లో జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తీగల సాగర్‌, రాంరెడ్డి గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదిరించుకున్న వ్యవసాయ వాణిజ్య ఒప్పందంతో దేశ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఒప్పందంలో భాగంగా పత్తి దిగుమతి సుంకం జీరోకి తీసుకొచ్చి 40 లక్షల బెల్‌ పత్తి దిగుమతికి అవకాశాలు ఇచ్చిందన్నారు. పత్తితోపాటు మొక్కజొన్న, పాల దిగుమతికి అవకాశాలు ఇస్తోందని, ఇది భారత రైతులను మరింత దెబ్బ తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి, వరి పంటలకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ముందుకు రావాలంటే ఇతర పంటలకు కనీస మద్దతు ధర, మార్కెట్‌ మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.

రాష్ట్రంలోకి ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి కూరగాయలు, పండ్లు, వంట నూనెల దిగుమతి అవుతోందని తెలిపారు. మన అవసరాలకు అనుగుణంగా పంటల సాగు చేయాలంటే పంటల ఉత్పత్తులకు బోనస్‌ ఇవ్వాలన్నారు. కేరళలో వ్యవసాయ విధానం రైతులకు మద్దతుగా ఉందని, 16 రకాల కూరగాయలు, పండ్లకు గ్రామ పంచాయతీలు కనీస ధర ప్రకటించి కొనుగోలు చేస్తున్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కోతుల సమస్య మూలంగా కొన్ని రకాల పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందని ఆందోలన వ్యక్తం చేశారు. ఈ శిక్షణా తరగతులు ప్రారంభం సందర్భంగా రైతు సంఘం జెండాను సీనియర్‌ నాయకులు ఇంజం నాగభూషణం ఆవిష్కరించారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షులు శీలం పకీరమ్మ, వాసిరెడ్డి ప్రసాద్‌, ఎస్‌కె మీరా, గొడవర్తి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శులు బిక్కసాని గంగాధర్‌, దివ్వెల వీరయ్య, రావుల రాజబాబు, రైతు సంఘం జిల్లా నాయకులు అంబటి శ్రీనివాస్‌ రెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు బాదావత్‌ శ్రీనివాసరావు, రైతు సంఘం మండల అధ్యక్షులు రాయల సత్యనారాయణ, కార్యదర్శి సకినాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -