మరింత మందిని తొలగిస్తాం : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా వెల్లడి
గౌహతి : మైనార్టీలపై రోజూ నోరుపారేసుకునే వివాదాస్పద ముఖ్యమంత్రి హిమంత బిశ్వా తాజాగా బీజేపీ కార్యకర్తల ఫిర్యాదులతో లక్షల మంది ఓటర్లను తొలగించామని భహిరంగంగా వెల్లడించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) సందర్భంగా ‘అనుమానాస్పదంగా భావించిన ఓటర్ల’ పేర్లను లక్షలాదిగా తొలగించినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ బుధవారం తెలిపారు. బిజెపి కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చాలా తొలగింపులు జరిగినట్టు తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న అసోంలో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రచురించిన ఒక రోజు తర్వాత ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి 2.43లక్షలకు పైగా పేర్లను తొలగించిన తర్వాత తుది జాబితా ప్రచురితమైంది. ”ఇది కేవలం ఆరంభం మాత్రమే. ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టినపుడు ఇలాంటి వారిని మరింత మందిని తొలగిస్తాం.” అని శర్మ ఇక్కడ జరిగిన పత్రికా సమావేశంలో చెప్పారు. సాధ్యమైనంతవరకు, మా పార్టీ సభ్యులే ఫిర్యాదులు చేస్తున్నారు. వాటి ఆధారంగా ఆ పేర్లను తొలగిస్తున్నామన్నారు. అస్సాం ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత మొదటిసారిగా పెద్ద సంఖ్యలో పేర్లను తొలగించామని సీఎం తెలిపారు. అక్రమ బంగ్లాదేశీ ముస్లిం (ఇమ్మిగ్రెంట్లు)లపై పోరాటం కొనసాగుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలు 5లక్షలకు పైగా ఫిర్యాదులు చేశారని చెప్పారు. అసోంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలను ఉద్దేశించి ‘మియా’ అని వ్యంగ్యంగా మాట్లాడారు. అయితే హిమంత అహంకార వ్యాఖ్యలపై సీపీఐ(ఎం) సుప్రింకోర్టులో వేసిన పిటిషన్‌ను విచారణకు చేపట్టిన విషయం తెలిసిందే.
బీజేపీ ఫిర్యాదులతో లక్షలాదిమంది ఓటర్ల తొలగింపు
- Advertisement -
- Advertisement -



