సీఐడీ పనితీరు మరింత మెరుగు పడాలి
నేపాలీ పనిమనుషుల పట్ల జాగ్రత్తగా ఉండండి
టెక్నాలజీ మరింతగా వినియోగించాలి : స్టాఫ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ సి.వి ఆనంద్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ డీజీపీ కార్యాలయంలో స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనరేట్ల పరిధులు, పోలీస్ స్టేషన్ల లిమిట్లు, సరిహద్దు గ్రామాల విభజన, జ్యూరిస్డిక్షన్ సంబంధిత అంశాలపై సంబంధిత కమిషనర్లతో విస్తృతంగా చర్చించారు. సర్కిళ్లు, జోన్లు, గ్రామాల పునర్విభజన వంటి అంశాలు అన్ని శాఖలకూ అనుకూలంగా ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా నేపాల్‌కు చెందిన వ్యక్తులు ఇంటి పనివారిగా పనిచేస్తూ కొన్ని నేరాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డొమెస్టిక్ సర్వెంట్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని డీజీపీ ఆదేశించారు. వారు ఎక్కడ నివసిస్తున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు అనే సమాచారాన్ని డేటాబేస్ రూపంలో అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో సీసీటీఎన్‌ఎస్ 2.0 అమలు, సీఐడీ వ్యవస్థ బలోపేతం, మాన్యువల్ ప్రక్రియల ఆధునీకరణ, భవిష్యత్ కార్యాచరణలపై కూడా చర్చించారు. అక్టోబర్‌లో మహిళా పోలీస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా పోలీసులకు 33 శాతం రిజర్వేషన్ సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, లా అండ్ ఆర్డర్, ఫీల్డ్ డ్యూటీలలో మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచించారు.
‘సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలి’
పోలీసింగ్‌లో సాంకేతికత వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉందని డీజీపీ తెలిపారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ ద్వారా కోర్ అప్లికేషన్లు, సీసీటీఎన్‌ఎస్ 2.0 అమలు, టీజీ కాప్స్ వ్యవస్థ వినియోగంపై అధికారులు చర్చించారు. ముఖ్యంగా డయల్-100, రౌడీ షీటర్లు, వాహనాల సెర్చింగ్, హిస్టరీ షీటర్ల డేటా వంటి అంశాలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వేగంగా అందుబాటులోకి తీసుకురావచ్చని వివరించారు. అలాగే ఏఐ ఆధారిత పోలీసింగ్, డ్రోన్స్, హెచ్‌ఆర్‌ఎంఎస్, డేటా ఇంటెలిజెన్స్, స్మార్ట్ అప్లికేషన్ల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీజీపీ సూచించారు. ‘‘తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్-యూజింగ్ టెక్నాలజీ’’ అనే లక్ష్యంతో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. మ్యాన్‌పవర్ మేనేజ్‌మెంట్, వెహికల్ ఆడిట్, సిబ్బంది వినియోగం, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై కూడా చర్చించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ బ్యూరోతో పాటు ఫుడ్ అడల్టరేషన్ కంట్రోల్‌కు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా చర్చించారు. ఈ సమావేశంలో డీజీపీతో పాటు హోంశాఖ కార్యదర్శి శిఖా గోయల్, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్, టీజీ టెక్నికల్ సర్వీసెస్ డీజీ వి.వి శ్రీనివాస రావు, హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్, అక్టోపస్ డీజీ అనిల్ కుమార్, హోమ్ గార్డ్స్ డీజీ స్వాతి లక్రా, మల్టి జోన్ -I చంద్రశేఖర్ రెడ్డి, రోడ్ సేఫ్టీ ఐజీ రమేశ్ నాయుడు, రాష్ట్ర పోలీస్ లాజిస్టిక్స్ ఐజీ గజరావు భూపాల్, ఫ్యూచర్ సిటీ కమిషన ర్ తరుణ్ జోషి, సైబరాబాద్ కమిషనర్ ఎం రమేశ్ రెడ్డి, మల్కాజ్‌గిరి కమిషనర్ సుమతితో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.



