Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వంతో సివిల్ సప్లై హమాలీ సంఘాల చర్చలు వాయిదా

ప్రభుత్వంతో సివిల్ సప్లై హమాలీ సంఘాల చర్చలు వాయిదా

- Advertisement -

పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని డిమాండ్‌..రెండు రోజులు గడువు కోరిన కమిషనర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెరిగిన ధరలకు అనుగుణంగా సివిల్ సప్లై హమాలీల రేట్లు పెంచాలని సోమవారం హమాలీ కార్మిక సంఘాల నాయకత్వంతో సివిల్ సప్లై రాష్ట్ర కమిషనర్, డైరెక్టర్, సంబంధిత అధికారుల సమక్షంలో చర్చలు జరిగాయి. హమాలీల ఎగుమతి దిగుమతి రేట్ల ఒప్పందంపై ఈ చర్చల్లో సీఐటీయూ, టీయూసీఐ, ఏఐటీయూసీ, బీర్ టీయూ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. చర్చల సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అధికారులకు సమస్యలు వివరిస్తూ ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా 2026-27 సంవత్సరానికి సంబంధించిన నూతన రేట్ల ఒప్పందం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.29ల నుండి రూ.35లకు పెంచాలని, సివిల్ సప్లై హమాలీలకు ఇస్తున్న పీఎఫ్ సౌకర్యాన్ని జీసీసీ హమాలీలకు కూడా ఇవ్వాలనీ, మహిళా స్వీపర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా కనీస వేతనాలు ఇవ్వాలని, బోనస్ రూ.పదివేలు ఇవ్వాలని, ప్రస్తుతం చెల్లిస్తున్న యూనిఫామ్ కుట్టుకూలి, స్వీట్ బాక్సులను పెంచాలని అధికారులను కోరారు.

ఆల్ హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు మాట్లాడుగూ హమాలీలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, మూడు నెల్లుగా బకాయి ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బేల్స్ (గట్టలు) బరువు తగ్గించాలని, ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.50ల నుండి రూ.200లకు పెంచాలని, గోదాముల్లో మంచినీరు, మరుగు దొడ్లు, రెస్ట్ రూమ్ లు ఏర్పాటు చేయాలని, పీఎఫ్ ఆధారంగా 60 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చర్చల్లో టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె. సూర్యం, న్యాయమైన వేతనాలు పెంచాలని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కోసం ప్రయత్నించాలని, హమాలీలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. హమాలీ యూనియన్ నాయకులు అధికారుల ముందుంచిన ప్రతిపాదనలను సివిల్ సప్లై కమీషనర్ సానుకూలంగా స్పందించారు. హమాలీ కార్మికులకు ప్రస్తుతం చెల్లిస్తున్న ఎగుమతి దిగుమతి రేట్లను రూ.29ల నుండి రూ.33లకు అదనంగా రూ.4లు పెంచేందుకు ప్రతిపాదన చేశారు.

బోనస్ రూ.7,500ల నుండి రూ.8,500లకు, స్వీట్ బాక్స్ రూ.800ల నుండి రూ.1,000లకు, యూనిఫామ్ కుట్టుకూలి రూ. 600ల నుండి రూ.800లకు, మహిళా స్వీపర్లకు గోదాముల సామర్థ్యాన్ని బట్టి ఉన్న వేతనంపై రూ.2,000లు పెంచేందుకు అంగీకరించారు. హమాలీలందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని, బేల్స్ (గట్టాలకు) రూ.50ల నుండి రూ. 100లకు పెంచుతామని, ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే క్లియర్ చేస్తామని తెలిపారు.. కమిషనర్ పెట్టిన ప్రతిపాదనలను యూనియన్లు సానుకూలంగా అంగీకరిస్తూనే.. పెరిగే ధరలకు అనుగుణంగా రేట్లు పెంచేందుకు పునరాలోచన చేసి ఒప్పందం చేసేందుకు మరోసారి చర్చలు జరపాలని కార్మిక సంఘాలు కోరాయి, దానికి అంగీకరించిన కమిషనర్ రెండు రోజుల్లో మరో దఫా చర్చలు జరిపి రేట్లు ఫైనల్ చేస్తామని తెలిపారు. ఈ చర్చల్లో సివిల్ సప్లై యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి. సుధాకర్, రాష్ట్ర అధ్యక్షులు కె. బాలయ్య, జీసీసీ హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బుస్సా మొగిలి, టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి డి. శ్రీనివాస్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. బాలరాజు, హనుమయ్య, బీఆర్ టీయూ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -