Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎబోలా అనుమానితులపై దృష్టి సారించండి

ఎబోలా అనుమానితులపై దృష్టి సారించండి

- Advertisement -

సరైన సమాచారం ఇవ్వకపోతే ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ వర్తించేలా చూడండి :
అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎబోలా లక్ష‍ణాలుండే అనుమానితులపై ప్రత్యేక దృష్టి సారించాలనీ, సరైన సమాచారం ఇవ్వకపోతే వారిపై ఎపిడెమిక్ డిసీజెస్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి దామోదర ‌రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర ‌సచివాలయంలో ఎబోలాపై సమీక్ష‍ నిర్వహించారు. ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారిని 21 రోజుల పాటు నిరంతరం పర్యవేక్ష‍ిస్తున్నామనీ, అనుమానితులుంటే వెంటనే గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌కు తరలిస్తున్నామనీ, ​అనుమానితులిద్దరికీ నెగిటివ్‌ వచ్చిందని మంత్రికి అధికారులు వివరించారు. ఐసీఎంఆర్ సూచన మేరకు వారి శాంపిల్స్‌ను మరోసారి టెస్టుల కోసం పూణేలోని ఎన్‌ఐవీకి పంపించామని చెప్పారు. రెండోసారి నెగిటివ్ వస్తే డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఐసీఎంఆర్ నుంచి ఎబోలా టెస్టింగ్ కిట్లు వచ్చాయనీ, టెస్టులు ప్రారంభించామని సీసీఎంబీ డైరెక్టర్, డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ మాట్లాడుతూ..అనుమానితుల నుంచి శాంపిల్స్‌ ‌సేకరణ, టెస్టులు చేయడంలో అలసత్వం వద్దని సూచించారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను కచ్చితంగా, సక్రమంగా అందించాల్సిందేనని స్పష్టం చేశారు.

తప్పుడు వివరాలిచ్చినా, వాస్తవాలను దాచిపెట్టినా ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. విదేశీ ప్రయాణికులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసేందుకు ఇంగ్లీష్, ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) సహకారం తీసుకోవాలనీ, విదేశీ భాషల్లో మాట్లాడగల సిబ్బందిని మూడు షిఫ్టుల్లో విమానాశ్రయంలో ఉంచాలని సూచించారు. కాంటాక్ట్ ట్రేసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, విమానాశ్రయ అధికారులు, పోలీసు శాఖ తదితర విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎబోలా వ్యాధి నివారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్, సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్‌ డాక్టర్ సంతోష్ చౌహాన్, కేంద్ర ఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్ కుమార్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పావని, జీఎంఆర్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ సంజయ్ కుమార్, జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, హైదరాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి, రంగారెడ్డి డీఎంహెచ్‌వో డాక్టర్ స్వర్ణకుమారి, ఐడీఎస్‌పీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శివ బాలాజీ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి డీసీపీ శిల్పవల్లి, ఇఫ్లూ ప్రొఫెసర్లు రాకేశ్ రంజన్, అన్న మేరీ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -