వచ్చే ఏడాదికి మరో
రూ. లక్ష కోట్ల ప్రణాళికలు సిద్ధం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆక్రమణలను తొలగించడంలో అవిశ్రాంతంగా పని చేస్తున్న హైడ్రా.. రూ. 1.10 లక్షల కోట్ల విలువైన భూములను కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించింది. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూములు ఇలా హైడ్రా స్వాధీనం చేసుకున్న భూములు లెక్కల్లో చూస్తే 2435.23 ఎకరాలు. బహిరంగ మార్కెట్లో విలువను పరిగణనలోకి తీసుకుంటే.. ఎకరం రూ. 100 కోట్ల చొప్పున లెక్క కట్టినా రూ. 2,43,500 కోట్లు. జీవకోటికి ప్రాణాధారమైన చెరువుల్లా.. ప్రాణవాయువును అందించే పార్కులుగా పరిగణిస్తే ఆ విలువ అనంతం. చెరువుల కబ్జాలను తొలగించి 449.11 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. మొదటి విడత చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణలో భాగంగా.. తమ్మిడికుంట వద్ద 15 ఎకరాలు, కూకట్‌పల్లి నల్ల చెరువులో 14 ఎకరాలు, ఉప్పల్ నల్ల చెరువులో 10 ఎకరాలు, సున్నం చెరువులో 15 ఎకరాలు, బమృకున్ ఉద్ దౌలా చెరువులో 11 ఎకరాలు, బతుకమ్మకుంటలో 5 ఎకరాల భూమిని కాపాడి.. ఆ మేరకు చెరువుల విస్తీర్ణాన్ని పెంచింది హైడ్రా. మొదటి విడత చేపట్టిన 6 చెరువుల చెంతనే 70 ఎకరాల వరకూ హైడ్రా కాపాడింది. ఇక రెండో విడత చేపడుతున్న 14 చెరువుల చెంత మరో 300 ఎకరాల వరకూ హైడ్రా కాపాడనుంది.
ప్రభుత్వ భూములు 1804.23 ఎకరాలు
హైడ్రా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులతో పాటు.. రెవెన్యూ అధికారులు అందించిన వివరాల ఆధారంగా 1804.23 ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లో 300 ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకుంటే.. ఘట్‌కేసర్ మండలం, కాచవాని సింగారం గ్రామంలో ఆక్రమణలున్నాయి. అమీన్‌పూర్‌లో 862 ఎకరాలను హైడ్రా కాపాడింది. అలాగే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్, కొండాపూర్ ఇలా నగరం నలువైపులా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. నాలాల ఆక్రమణలను తొలగించి 19.26 ఎకరాలు, పార్కులను కబ్జాదారుల నుంచి విడిపించి 90.29 ఎకరాలు, రహదారులు, ఫుట్‌పాత్‌లను తొలగించి 50.06 ఎకరాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలను తొలగించి 21.29 ఎకరాలున్నాయి.
భూమిని స్వాధీనం చేసుకోవడమంటే..
ఆక్రమణలు తొలగించడమంటే సాధారణమైన విషయం కాదని హైడ్రా చేసిన ప్రతి ఆపరేషన్లోనూ కనిపించింది. ఎన్నో ఛాలెంజ్‌లు ఎదురయ్యాయి. మరెన్నో ఒత్తిడిలు.. అయినా ప్రభుత్వం ఎక్కడా వెరవలేదు. హైడ్రాను ముందుకు నడిపించి లక్ష్యంవైపు ప్రయాణించేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించింది. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న భూమి ఎకరం విలువ ఎక్కడా రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు తక్కువ లేదు. హైడ్రా భారీ ఆపరేషన్లు నిర్వహించి ప్రజలకు చెందాల్సిన భూములను కాపాడింది.
మరో రూ. లక్ష కోట్ల భూములు కాపాడే పనిలో హైడ్రా : కమిషనర్ ఏవీ రంగనాథ్
హైడ్రా 2024వ సంవత్సరం జులై 19న ఏర్పడింది. మరో నెల రోజుల్లో రెండేండ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ రెండేండ్లలో రూ. 1.10 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడితే.. వచ్చే ఏడాది మరో రూ. లక్ష కోట్ల విలువైన భూములు కాపాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. చెరువులను పెద్దమొత్తంలో పునరుద్ధరించి పర్యావరణానికి పెద్దపీట వేయనుంది. మొదటి విడత 6 చెరువులు, రెండో విడత 14 చెరువుల పునరుద్ధరణకు తోడు.. మరో 4 పెద్ద చెరువులను మినీ ట్యాంక్ బండ్‌లుగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. వర్షాకాలం కాలనీలు, రహదారులను వరద ముంచెత్తకుండా.. క్షేత్రస్థాయిలో సైన్యం మాదిరి హైడ్రా డీఆర్ ఎఫ్, మెట్ (మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్)టీమ్‌లు గస్తీ కాయనున్నాయి. గతేడాది 150 డివిజన్లకే పరిమితమైన హైడ్రా… ఈ ఏడాది మూడు కమిషనరేట్ల పరిధిలో బాధ్యతలను తీసుకుంది.
రూ. 1.10 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



