హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా అమర్నాథ్ నియామకాన్ని హైకోర్టు సోమవారం రద్దు చేసింది. ఆయన నియామకానికి సంబంధించి అంబుడ్స్‌మన్ జారీ చేసిన ఉత్తర్వులు చట్టబద్ధం కావని తేల్చిచెప్పింది. అధ్యక్ష పదవికి 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలనీ, అప్పటి వరకు ప్రస్తుత ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించింది. 2023 ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్రావు అరెస్టు కావడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ అమర్నాథ్ను అధ్యక్షుడిగా నియమిస్తూ అంబుడ్స్‌మన్ ఫిబ్రవరి రెండున ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని సాగర్ క్రికెట్ క్లబ్ సవాలు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ యారా రేణుక, అధ్యక్షుడి అరెస్టు కారణంగా ఏర్పడిన ఖాళీని ఓట్ల ఆధారంగా భర్తీ చేసే అధికారం అంబుడ్స్‌మన్‌కు లేదని స్పష్టం చేశారు. దీంతో అమర్నాథ్ నియామకాన్ని రద్దు చేస్తూ, కొత్త ఎన్నికల నిర్వహణకు ( 45 రోజుల్లో ) ఆదేశాలు జారీ చేశారు.
కాలుష్య నివారణ అందరి బాధ్యత : హైకోర్టు
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు జంట జలాశయాల నుంచి సరఫరా అవుతున్న తాగునీటిలో కాలుష్యాన్ని నివారించడం ఒక్క జలమండలి బాధ్యత మాత్రమే కాదనీ, అన్ని ప్రభుత్వ శాఖలు సమష్టిగా బాధ్యత వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తాగునీటి కాలుష్యం ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యంత కీలక అంశమనీ, ఎవరూ తమకు సంబంధం లేదని చెప్పుకోలేరని పేర్కొంది. కాలుష్యం అంటే కేవలం బ్యాక్టీరియా మాత్రమే కాదనీ, నీటిలోని భార లోహాల ప్రభావాన్ని కూడా తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు ప్రాధాన్యతను దష్టిలో ఉంచుకుని సీనియర్ న్యాయవాది కె వివేక్‌రెడ్డిని అమికస్ క్యూరీగా నియమించింది. జీహెచ్ఎంసీతో పాటు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నీటి నాణ్యతపై పత్రికా కథనం ఆధారంగా వచ్చిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు, సోమవారం విచారణ చేపట్టింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పరిశోధనలో నీటిలో విషపూరిత లోహాలు, ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారని లేఖలో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా చెరువుల్లో మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపినా, శుద్ధి చేయని మురుగునీరు ఎలా జలాశయాల్లోకి చేరుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వచ్చేనెల రెండో తేదీకి వాయిదా వేసింది.
కంపెనీలకు నోటీసులు
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లోని శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చెందిన భూముల కేటాయింపుపై హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. భూములు పొందిన పలు ప్రయివేటు కంపెనీలకు నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. దేవస్థానానికి చెందిన 1,148 ఎకరాల భూమిని భూసేకరణ చట్టం కింద స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త శేఖర్‌రావు, రాష్ట్రీయ వానరసేన సమితి వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ దేవాదాయ శాఖ భూములకు భూసేకరణ చట్టం వర్తించదనీ, ప్రభుత్వం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. భూములను మార్కెట్ విలువకు చాలా తక్కువగా టీజీఐఐసీకి కేటాయించారనీ, తర్వాత కొన్ని కంపెనీలు వాటిని తాకట్టు పెట్టి భారీ రుణాలు పొందాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదిస్తూ భూసేకరణ ప్రక్రియ పూర్తయిందనీ, రూ.178 కోట్ల పరిహారం చెల్లించినట్లు తెలిపారు. ఇప్పటికే కొంతమంది కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు గుర్తుచేసిన ధర్మాసనం, మిగిలిన కంపెనీలకూ నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
ముందస్తు బెయిల్ పిటిషన్లపై 11న విచారణ
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారంలో నమోదైన క్రిమినల్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పలువురు రైస్ మిల్లర్లు హైకోర్టును ఆశ్రయించారు. మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని దారి మళ్లించడం ద్వారా ప్రభుత్వానికి రూ.3,960 కోట్ల నష్టం కలిగించారనే ఆరోపణలతో సుమారు 360 మిల్లులపై కేసులు నమోదయ్యాయి. కేసుల రద్దు కోసం దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఇటీవల తిరస్కరించడంతో, అరెస్టు భయంతో మిల్లర్లు ముందస్తు బెయిల్ కోరారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుజన సోమవారం విచారణ చేపట్టగా, ఇదే అంశానికి సంబంధించిన మరికొన్ని పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని పిపి తెలిపారు. అన్ని పిటిషన్లను కలిపి విచారించాలని కోరడంతో ధర్మాసనం అంగీకరించి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.
ఆధారాలు సమర్పించాలి : హైకోర్టు
ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటే తగిన ఆధారాలు అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం చట్టం అమలులో విఫలమైందని నిర్ధారించాలంటే మరింత సమగ్ర సమాచారాన్ని సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది. లా పైలట్ ఫౌండేషన్ డైరెక్టర్ బి కార్తీక్ నవాయన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్సీఆర్బీ గణాంకాలను ప్రస్తావిస్తూ 2023లో ఎస్సీ, ఎస్టీలపై దాదాపు 57 వేల కేసులు నమోదయ్యాయని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం, ప్రతి పౌరుడి భద్రత ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా పోలీసు రక్షణ కల్పించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం అమలులో వైఫల్యం వల్లే దాడులు జరుగుతున్నాయని నిరూపించడానికి తగిన ఆధారాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 599 టాయిలెట్ బ్లాకుల నిర్మాణానికి రూ.27.55 కోట్లు కేటాయించగా, మల్దకల్ జూనియర్ కళాశాలకు రూ.9.20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపింది. ఉండవెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణానికి రూ.26 లక్షలు విడుదల చేసినట్లు పేర్కొంది. విద్యార్థినులకు మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంపై వచ్చిన పత్రికా కథనాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు ఈ కేసును విచారిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం వివరించగా, వాటి పురోగతిపై తాజా స్థితిగతుల నివేదిక సమర్పించాలని ధర్మాసనం సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 15కు వాయిదా వేసింది.
హెచ్‌సీఏ అధ్యక్షుడుగా అమర్నాథ్ నియామకం చెల్లదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



