Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబడుల్లో బ్రేక్ ఫాస్ట్‌ పరిమితమే.!

బడుల్లో బ్రేక్ ఫాస్ట్‌ పరిమితమే.!

- Advertisement -

27 వేల బడులు ఉంటే 1700 పాఠశాలకే ప్లాన్‌
చెప్పేది కొండంత అమలు గోరంత
సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు
బడులు తెరిచేందుకు 
8 రోజులే గడువు
ఊసేలేని పూర్తిస్థాయి ప్రణాళిక


​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని, పేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం, ఆచరణలోకి వచ్చేసరికి వెనకడుగు వేస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ పథకం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అమలు కావాల్సి ఉండగా, ప్రస్తుతానికి కేవలం 1700 పాఠశాలలకు మాత్రమే పరిమితం చేస్తోంది. తొలి విడతలో సెంట్రలైజ్డ్ కిచెన్ సదుపాయం ఉన్న ప్రాంతాల్లోనే దీనిని ప్రారంభించనుంది. ఆ తర్వాత విడతల వారీగా విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే బడులు ప్రారంభం కావడానికి మరో 8 రోజులే సమయం ఉండటంతో, ఈ అరకొర అమలుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.​

ప్రకటనలు ఘనం… ఆచరణ శూన్యం!
ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డిపాటు మంత్రులు బ్రేక్‌‌ఫాస్టు పథకం అమలుపై గొప్పగా చెబుతున్నారు. దీని అమలు కోసం 2026-27 విద్యా సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు ప్రకటించింది. విద్యాశాఖ సమావేశాలు, బహిరంగ సభల్లో సైతం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని తమ ప్రభుత్వ మైలురాయిగా చెప్పుకున్నారు. ఏకంగా తెలంగాణ రైజింగ్ నెంబర్ వన్ వంటి చర్చా కార్యక్రమాల్లో కూడా ఈ పథకం ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా మే 11 నుంచి 17 వరకు నిర్వహించిన ఎడ్యుకేషన్ వీక్‌లో ఈ పథకానికి విపరీతమైన ప్రచారం కల్పించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో వెనుకడుగే కనిపిస్తోంది.

ఇరకాటంలో టీచర్లు
ఈ పథకాన్ని కొన్ని పాఠశాలలకే పరిమితం చేయడం వల్ల ఉపాధ్యాయులు ఇరకాటంలోపడ్డారు. అడ్మిషన్లు పెంచే క్రమంలో ఇంటింటికి తిరిగి పిల్లకు ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం ఉంటుంది కాబట్టి మీ పిల్లలను బడికి పంపించాలంటూ టీచర్లు తల్లిదండ్రులను ఒప్పించి బడిలో చేర్పించారు. మండల స్థాయి సమావేశాల్లో విద్యాధికారులు (ఎంఈఓలు) ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఆయుధంగా చేసుకుని ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెంచాలని సూచించారు. దీంతో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం ఇచ్చే ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా పెడతామని తల్లిదండ్రులకు నమ్మబలికారు. విద్యాశాఖ విడుదల చేసిన ఆకర్షణీయమైన బ్రోచర్లను పంచుతూ, వారంలో ఏ రోజు ఏ టిఫిన్ (ఇడ్లీ, ఉప్మా, పొంగల్ వంటివి) పెడతారో వివరంగా వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో కూడా టీచర్లు ఇదే నమ్మకంతో ప్రచారం చేస్తున్నారు. తీరా ఇప్పుడు కేవలం 1700 స్కూళ్లలోనే అమలు అంటే, మిగిలిన 25 వేలకు పైగా పాఠశాలల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక టీచర్లు తలపట్టుకుంటున్నారు.

​పూర్తయిన జిల్లాల సెలక్షన్… జాబితా ఏదీ?
ఇప్పటికే జిల్లాల వారీగా డీఈఓల ద్వారా పాఠశాలల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. అయితే ఏ ప్రాతిపదికన ఈ 1700 పాఠశాలలను ఎంపిక చేశారు? మిగిలిన పాఠశాలల పరిస్థితి ఏమిటి? అనే దానిపై విద్యాశాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించాలనేది అధికారుల వాదన అయినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని వేల సంఖ్యలో ఉన్న పాఠశాలలకు ఈ సౌకర్యం ఎప్పటికి అందుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ బడుల వైపు పిల్లలను ఆకర్షించేందుకు పథకాలు ప్రకటించడం మంచిదే అయినా, వాటిని అమలు చేయడంలో జాప్యం చేస్తే ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. అట్టహాసంగా బ్రోచర్లు విడుదల చేసి, ప్రచారం చేయించుకుని, తీరా అమలు దగ్గరకు వచ్చేసరికి విడతల వారీ అని మడమ తిప్పడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఈ పథకం అమలుపై స్పష్టమైన విధివిధానాలు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -