కార్పొరేషన్లలో అత్యధికంగా నల్లగొండలో 77.36
అత్యల్పంగా నిజామాబాద్‌లో 59.12
మున్సిపాల్టీల్లో అత్యధికంగా చౌటుప్పల్ 91.91
అత్యల్పంగా నందికొండలో 59.68
కార్పొరేషన్ల కన్నా మున్సిపాల్టీల్లో 9.83 శాతం అధికం : ఎన్నికల సంఘం
చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల్లోని 2,983 వార్డులకు బుధవారం జరిగిన ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. గడువులోగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దాంతో కొన్ని చోట్ల రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఉదయం మందకోడిగా మొదలైన పోలింగ్ మధ్యాహ్నానికి పుంజుకుంది. 7 కార్పొరేషన్లలో 66.05 శాతం, 116 మున్సిపాల్టీల్లో 75.88 శాతం నమోదైంది.
కార్పొరేషన్లతో పోల్చుకుంటే మున్సిపాల్టీల్లో 9.83 శాతం పోలింగ్ ఎక్కువగా నమోదైంది. ఉదయం ఏడు నుంచి 9 గంటల వరకు మొదటి రెండు గంటల్లో 11.06 పోలింగ్ నమోదు కాగా, అ తర్వాత 9 నుంచి 11 గంటల వరకు 28.48 శాతం ఓటింగ్ నమోదైంది. 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 48.54 శాతం, ఒంటి గంట నుంచి 3గంటల వరకు 62.55 శాతం, ఓవరాల్‌గా 73.01 శాతంగా పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కార్పొరేషన్లలో అత్యధికంగా నల్లగొండలో 77.36 శాతం, ఆ తర్వాత భద్రాద్రి కొత్త గూడెంలో 74.52 శాతం పోలింగ్ నమోదైనట్టు పేర్కొంది. అత్యల్పంగా నిజామాబాద్‌లో 59.12 శాతం, ఆ తర్వాత కరీంనగర్‌లో 62.98 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపాల్టీల్లో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో 91.91 శాతం, ఆ తర్వాత మూడు జిల్లాలో 90 శాతానికి పైగా పోలింగ్ జరిగింది.
నల్లగొండ జిల్లా చండూర్‌లో 91.52, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 90.98, యాదాద్రి జిల్లా పోచంపల్లిలో 90.95 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యల్పంగా నల్లగొండ జిల్లా నందికొండలో 59.68 శాతం, ఆ తర్వాత నిర్మల్ జిల్లా భైంసాలో 62.71, ఆసీఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లో 64.32, భూపాల్‌పల్లిలో 68.18 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొంది. మొత్తం 52,17,413 మంది ఓటర్లకు గాను 38,09,406 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారని ఈసీ వెల్లడించింది. ఇందులో 18,51,829 మంది పురుషులు (72.63) శాతం, 19,57,226 మంది మహిళలు (73.39 శాతం), ఇతరులు 351(55.02శాతం) ఓటింగ్‌లో పాల్గొన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. పురఓటర్లు పార్టీల భవిష్యత్‌ను ఓటు రూపంలో బ్యాలెట్‌బాక్స్‌లో భద్రపర్చారు. విజయం ఎవరిని వరిస్తుందో శుక్రవారం తేలనుంది.
ప్రశాంతంగా పోలింగ్..
మున్సిపల్ ఎన్నికలు ప్రశాతంగా ముగిశాయి. ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ పోలింగ్ ముగిసే సమయానికి రాష్ట్రంలో చిన్న చిన్న ఘటనలు నమోదయ్యాయి. ప్రధాన పార్టీల మధ్య వాగ్వాదాలు, ఘర్ణణలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల రాజకీయ పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నేత జగాగ్గరెడ్డి, ఎంపీ అర్విద్ పోలీసులతో బాహాబాహికి దిగారు. అయితే ఉన్నతాధికారులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.



