– వారికి సైన్స్ కావాలి…
– సైన్స్ కు మహిళలు కావాలి : డాక్టర్ వి.రాధ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వంటిల్లె సైన్స్ అనీ, అయితే మహిళలకు మాత్రం సైన్స్‌లో చోటు లేదని సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త రిటైర్డ్ డాక్టర్ వి.రాధ తెలిపారు. ఇంటర్నేషనల్ డే అఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్‌ను పురస్కరించుకుని బుధవారం జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర సమతా సబ్ కమిటీ నిర్వహించిన వెబినార్‌కు సమతా కో- కన్వీనర్ పి.రజని అధ్యక్షత వహించారు. వెబినార్‌లో రాష్ట్ర బాధ్యులు, వివిధ జిల్లాల బాధ్యులు, విద్యార్థులు కలిపి 2 వేల మంది పాల్గొన్నారు. వెబినార్‌లో ”సమాజంపై మహిళల శాస్త్రీయ సేవల ప్రభావం” అనే విషయంపై డాక్టర్ వి.రాధ, ”యౌవన బాలికలలో మెన్స్ట్రువల్ హైజీన్ మరియు జంక్ ఫుడ్ ప్రభావం” అనే విషయంపై హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజ్ ఫిజియాలజీ ప్రొఫెసర్, డాక్టర్ ఎం.రమా దేవి మాట్లాడారు.
రాధ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్, గణిత రంగాల్లో (స్టెమ్) లింగపరమైన అసమానత్వం అభివృద్ధి చెందిన దేశాల్లోనూ స్థిరంగా కొనసాగుతున్నట్లు ‘యునెస్కో’ గుర్తించిందని తెలిపారు. ఈ అంతరం వల్ల మహిళల మేధాశక్తిని ప్రపంచం పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతోందని చెప్పారు. ఉన్నత విద్యలో మహిళలు అద్భుతమైన పురోగతిని సాధిస్తున్నప్పటికీ సైన్స్, టెక్నాలజీ రంగాల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందన్నారు. పైగా అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలను వారు అందుకోలేకపోతున్నారని తెలియజేశారు. కృత్రిమ మేధ కార్యకలాపాల్లో మహిళలు 22 శాతమే ఉండగా, క్వాంటమ్ కంప్యూటింగ్‌లో మరీ తక్కువగా రెండు శాతానికే పరిమితమయ్యారనీ, స్టెమ్ పరిశోధనల్లోనూ వారి ప్రాతినిధ్యం 31 శాతానికే పరిమితమని ఐక్యరాజ్యసమితి వెల్లడించిందని తెలిపారు. ఈ విభాగాల్లో వేళ్లూనుకున్న లింగ అసమానత్వం మహిళా సాధికారతకు, దేశ ఆర్థిక వ్యవస్థకు, యావత్ ప్రపంచ పురోగతికీ విఘాతకరమని రాధ అభిప్రాయపడ్డారు. ఈ సంగతిని గుర్తించిన పలు దేశాలు స్టెమ్ విభాగాల్లో బాలికలూ, మహిళలకు అవకాశాలను మెరుగుపరిచేలా విధివిధానాలను రూపొందించాలని ఈ సందర్బంగా సమతా సబ్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ వెబినార్‌లో జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ దాసరి ప్రసాదరావు, రాష్ట్ర బాధ్యులు వెంకటేష్ రెడ్డి, విద్యాసాగర్, రాష్ట్ర సమతా కమిటీ బాధ్యులు విమల, శాంతి, కోకిల, సుచిత్ర, కస్తూరి తదితరులు పాల్గొన్నారు.
వంటిల్లే సైన్స్… కానీ, మహిళకి చోటేది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



