నవతెలంగాణ-హైదరాబాద్: నేపాలీ గ్యాంగ్ హైదరాబాద్ నగరంలో మరో భారీ చోరీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు కిలో బంగారు ఆభరణాలు, వజ్రాలను ఈ ముఠా అపహరించింది. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన దంపతులు ప్రధాన అనుమానితులుగా పోలీసులు భావిస్తున్నారు.
నెల రోజుల క్రితమే వ్యాపారవేత్త వీరిని పనిలో పెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం యజమాని కుటుంబం ముంబయికి వెళ్లి.. ఆదివారం తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు కనిపించకుండా పోయారు. ఇంటి తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో వారు చెప్పకుండా వెళ్లిపోయారని వ్యాపార వేత్త భావించారు. ఆ తర్వాత పూజ గదిలో విగ్రహానికి ఉన్న బంగారు గొలుసుతో పాటు ఇంట్లోని మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు ఆలస్యంగా గుర్తించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నాయి.



