- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-సత్తుపల్లి: ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన సర్వేచేసి వాటిని స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులోని ‘వేశ్య కాంతల చెరువు’ పరిధిలోని ప్రభుత్వ భూమిని మంత్రి పొంగులేటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్‌తో కలిసి పరిశీలించారు.
రికార్డులు పరిశీలించి నిష్పక్షపాతంగా సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సత్తుపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు ఏ విధంగా ఆక్రమణకు గురయ్యాయనే వివరాలను రెవెన్యూ అధికారులు మంత్రి పొంగులేటికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పక్షపాతం లేకుండా తక్షణమే సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
”రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచడమే ప్రభుత్వ లక్ష్యమని, రెవెన్యూ రికార్డుల ప్రకారం అది పట్టా భూమి అయితే లబ్ధిదారులకు అప్పగించాలని, ఒకవేళ ప్రభుత్వ భూమి అని తేలితే మాత్రం తక్షణమే స్వాధీనం చేసుకొని, సరిహద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫెన్సింగ్ ఏర్పాటుకు సంబంధించి నిధులను కలెక్టర్‌కు చెప్పి ఇప్పిస్తానని మంత్రి పొంగులేటి రెవెన్యూ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, తహశీల్దార్ పున్నం సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు గాదె చెన్నకేశవరావు, మొహమ్మద్ కమల్ పాషా, పింగుల సామేలు, గొర్లమారి రామ్మోహనరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.



