ఇంటిగ్రేటెడ్ కళాశాలకు మోక్షం ఎప్పుడు.?
వంద పడకల ఆస్పత్రికి ప్రారంభించని పనులు
అమలు కాని ప్రభుత్వ లక్ష్యం..
నవతెలంగాణ-వర్ధన్నపేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా పేరుతో ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు రూ.200 కోట్లతో మంజూరు చేసింది. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలతో పాటు గతంలో మంజూరైన వంద పడకల ఆస్పత్రికి సైతం స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భూమి పూజ చేశారే తప్ప అభివృద్ధి పనులు నేటికీ ప్రారంభించకపోవడంతో పట్టణ ప్రజలు అభివృద్ధి ఎప్పుడో ? అని ఎదురుచూస్తున్నారు. గత 30 ఏండ్లుగా వర్ధన్నపేట అభివృద్ధికి నోచుకోలేదని, ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు నాయకత్వంలో పట్టణం అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ ప్రజలు ఆశించారు.
ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రత్యేక మార్కు వర్ధన్నపేటపై ఉంటుందని స్థానిక ప్రజలు గట్టిగ నమ్మారు. గతంలో వర్ధన్నపేట పట్టణ శివారులో గువ్వలబోడు ప్రభుత్వ భూమిలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజులు చేతుల మీదుగా స్థలానికి భూమి పూజ చేయడంతో అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయని స్థానిక ప్రజలు భావించారు.
కనీసం ఈ విద్యా సంవత్సరంలోనైనా ఇంటిగ్రేటెడ్ కళాశాల పనులు ప్రారంభమైతే అన్ని వర్గాల ప్రజలు ఒకే సమూహంలో నాణ్యమైన విద్య అభ్యసించడంతోపాటు ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ప్రజలు భావిస్తున్నారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణంతో పాటు ఇంటిగ్రేటెడ్ కళాశాల నిర్మాణం పూర్తయితే వెనుకబడ్డ వర్ధన్నపేటకు కొంత ఆదరణ చేకూరుతుందని పట్టణ ప్రజలు ఆశపడుతున్నారు. కానీ భూమి పూజలు తప్ప అభివృద్ధికి నోచుకునే పరిస్థితి లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా గత ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. కానీ పూర్తిస్థాయి సౌకర్యాలు లేకపోవడంతో కట్ర్యాల సమీపంలో గతంలో వంద పడకల ఆస్పత్రికి భూమి పూజ చేశారు. ఇక్కడే ఇంకో సమస్య తలెత్తింది. వర్ధన్నపేటలోనే వంద పడకల ప్రభుత్వాస్పత్రిని నిర్మించాలని స్థానికులు ఆందోళన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ప్రజలకు అనుకూలమైన ప్రదేశంలోనే నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఆస్పత్రి నిర్మాణంతో పాటు యంగ్ ఇండియా పేరుతో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కళాశాల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని పట్టణ ప్రజలు ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ను కోరుతున్నారు.



