లక్షద్వీప్‌కు చెందిన 80 ఏండ్ల నర్సు హిందుంబి కౌరోమ్ కక్కడ… ఐదు దశాబ్దాలకు పైగా రోగులకు సేవ చేస్తూ, ప్రసవాలకు సహాయం చేస్తూ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటూ, కొత్త తరం నర్సులకు స్ఫూర్తినిస్తున్నారు. ఇలా తన వృత్తి జీవితంలో ఎన్నో సేవలు అందించిన ఆమె ఆస్టర్ గ్లోబల్ గార్డియన్స్ నర్సింగ్ అవార్డుకు ఎంపికైన టాప్ పది ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచారు. ఆ స్ఫూర్తి దాయక జీవిత పరిచయం నేటి మానవిలో
80 ఏండ్ల వయసులోనూ హిందుంబి లక్షద్వీప్‌లోని కవరత్తిలో ఉన్న ఇందిరా గాంధీ ఆసుపత్రిలో తన నర్సింగ్ విధుల కోసం ఉదయం 8 గంటలకు తప్పకుండా హాజరవుతారు. అయితే ఆమె 60 తన ఏండ్ల వయసులో పదవీ విరమణ చేశారు. కానీ మూడు నెలల తర్వాత కాంట్రాక్ట్ నర్సుగా తిరిగి వచ్చారు. ఆదివారాలు మినహా ప్రతిరోజూ పనిచేస్తారు. ఆదివారమైనా అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రం తప్పకుండా వస్తారు. అర్ధరాత్రి వేళల్లో కేసులు ఉన్నా ఆమె సిద్ధంగా ఉంటారు.
గ్లోబల్ నర్సింగ్ అవార్డు కోసం…
‘ఇది నా కర్తవ్యం, నాకు శక్తి ఉన్నంత వరకు నేను పనిచేస్తూనే ఉంటాను’ అని ఆమె అంటున్నారు. హిందుంబి 53 ఏండ్ల వృత్తి జీవితంలో క్రమశిక్షణ, అంకితభావం కీలకంగా ఉన్నాయి. భారతదేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో ఒకటైన ఆ ఆసుపత్రిలో ఆమె 20,000కు పైగా శస్త్రచికిత్సలు, అత్యవసర కేసులకు సహాయం అందించారు. 2023లో ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు విజేత అయిన ఆమె ఇప్పుడు ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ 2026 కోసం టాప్ 10 ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచారు. ఆస్టర్ డిఎం హెల్త్‌కేర్ ద్వారా స్థాపించబడిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారంతో $250,000 (దాదాపు రెండు కోట్లు) బహుమతితో పాటు ఆమెకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తాయి. ఈ ఏడాది జూలైలో జరిగే ఓ కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తారు.
నాలుగేండ్లు ఇంటికి వెళ్లలేదు
హిందుంబి రెండేండ్ల పాటు కోజికోడ్‌లోని ప్రొవిడెన్స్ హైస్కూల్లో చదువుకున్నారు. ఉత్తర కేరళలోని ఆ నగరానికి మంగళూరు మీదుగా కాటమరాన్‌లో ప్రయాణించడానికి ఏడు రోజులు పట్టేది. అక్కడ పదో తరగతి పూర్తి చేశాక కోజికోడ్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ కోర్సులో చేరారు. అక్కడ నాలుగేండ్లపాటు హాస్టల్లో ఉన్నారు. ఆ మార్గంలో కేవలం రెండు చిన్న ఓడలు మాత్రమే తిరిగేవి. దాంతో తన కోర్సు పూర్తి చేసే వరకు ఆమె ఒక్కసారి కూడా తిరిగి కవరత్తికి వెళ్ళలేదు. కోర్సు పూర్తి చేశాక కవరత్తిలోని ఇందిరా గాంధీ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా చేరడానికి ఇంటికి తిరిగి వచ్చారు. ఆమె తన వృత్తి జీవితం ప్రారంభంలో ద్వీపాలలో విద్యుత్తు, నిపుణులైన వైద్యులు, సరైన రవాణా సౌకర్యం ఉండేవి కావు. ఇలాంటి పరిమితులలోనే ఆమె పనిచేయడం నేర్చుకున్నారు. 1975లో విద్యుత్ కోతలు సర్వసాధారణం. అలాంటి పరిర స్థితుల్లో కిరోసిన్ దీపం వెలుగులో ఒక రోగికి శస్త్రచికిత్సలో ఆమె సహాయం చేశారు.
ఆపద సమయాల్లో…
“ఆసుపత్రి నుండి ఒక గైనకాలజిస్ట్‌తో కలిసి అగట్టిలో ఒక రోగికి చికిత్స చేయడానికి వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఆమెకు రక్తస్రావం అవుతుండటంతో అక్కడ చికిత్స చేయడం సాధ్యపడలేదు. మేము ఆమెను ఒక చేపల పడవలో ఎక్కించి సముద్రం మధ్యలో రక్త మార్పిడి చేశాము. మేము కవరట్టికి చేరుకున్న తర్వాత డాక్టర్ సి-సెక్షన్ చేశారు. దాంతో తల్లి, బిడ్డ ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు” అని ఆమె గుర్తుచేసుకున్నారు. కలరా వ్యాప్తితో దెబ్బతిన్న అమిని ద్వీపానికి ప్రయాణించిన విషయాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ఆమె అక్కడ 10 రోజుల పాటు ఇంట్రావీనస్ లైన్లు వేస్తూ ఉన్నారు. పరిస్థితులు మెరుగుపడ్డాక కవరట్టికి తిరిగి వచ్చారు. 2004 సునామీ సమయంలో గాయపడిన వారికి చికిత్స అందించారు. అలాగే కోవిడ్-19 మహమ్మారి సమయంలోనూ ఆమె తన అంకితభావం, నిబద్ధతలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు.
‘నా బిడ్డకు నువ్వే జన్మనిచ్చావు’
కవరత్తి వీధుల్లో ఒక వ్యక్తి తన స్కూటర్‌ను ఆపి హిందుంబిని పిలుస్తాడు. అతను తన పక్కన ఉన్న బిడ్డను చూపిస్తూ.. ‘ఈ బిడ్డకు నువ్వే జన్మనిచ్చావు’ అని అంటాడు. పోస్ట్ ఆఫీసులో కలిసి ఓ మహిళ ఆమె జన్మనిచ్చిన కుమార్తె సచివాలయంలో చేరబోతోందని చెబుతుంది. ఆమెను ఇంటికి తీసుకెళ్లిన ఒక వ్యక్తి తన కుమార్తెను చూపిస్తూ అదే మాట అంటాడు. ఇలా అందరూ అంటుంటే ‘నాకు అపారమైన ఆనందం కలుగుతోంది’ అని ఆమె అంటారు. లక్షద్వీప్‌లో 53 ఏండ్ల నర్సింగ్ జీవితం ఇలా ఉంటుంది. దారిలో అపరిచితులు ఆమెను ఆపి, ‘మీరు అక్కడ ఉన్నారు కదా’ అని చెప్పినప్పుడు ఆమెకు కలిగే ఆనందం అనంతం.
అచంచలమైన కుటుంబ మద్దతు
తన ఐదు దశాబ్దాల కెరీర్లో అత్యంత సవాలుతో కూడిన క్షణాల గురించి హిందుంబిని అడిగితే.. ఆమె సమాధానం చాలా సరళంగా ఉంటుంది. ‘ఏమీ లేదు. నా పని నాకు ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు’ అంటుంది. తన కుటుంబ మద్దతు లేకుండా తన వృత్తి పట్ల ఈ అంకితభావం సాధ్యమయ్యేది కాదని ఆమె అంటున్నారు. ‘ఇప్పటికీ, అర్ధరాత్రి నాకు ఫోన్ కాల్ వస్తే, మా కుటుంబం నన్ను ఆసుపత్రి దగ్గర దింపుతుంది. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు నేను పగలు రాత్రి పని చేయాల్సి వచ్చినప్పుడు, వారు నాకు అండగా నిలిచారు’ అంటారు. ఆమె ఉదయం 5 గంటలకు నిద్రలేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని 7.30 గంటలకల్లా ఆసుపత్రికి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. ఎటువంటి మార్పు లేకుండా ఏండ్లుగా ఆమె ఇదే దినచర్యను పాటిస్తున్నారు.
తాను గెలిస్తే
పదవీ విరమణ గురించి అడిగితే ఆమె నవ్వుతున్నారు. ఆ ఆలోచనే ఆమె మనసులోకి రాలేదనిపిస్తుంది. ఆస్టర్ గ్లోబల్ గార్డియన్స్ నర్సింగ్ అవార్డుకు నామినేట్ అయినందుకు హిందుంబి చాలా ఆనందంగా ఉన్నారు. ఒకవేళ ఆమె గెలిస్తే ఆ బహుమతి డబ్బును ఆర్థిక స్తోమత లేని రోగుల చికిత్సకు సహాయం చేయడానికి ఉపయోగించాలని ఆమె నిర్ణయించుకున్నారు. కవరత్తిలో యువతీ యువకులు నర్సింగ్ వృత్తిని స్వీకరిస్తున్నందుకు ఆమె సంతోషంగా ఉన్నారు. ఆమె కొడుకు నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అలాగే ఆమె మనవడు నర్సింగ్‌లో బీఎస్సీ చదువు తున్నాడు. నర్సు కావాలనుకునే వారికి ఆమె ‘నర్సింగ్ ఒక గొప్ప వృత్తి. మంచాన పడిన రోగులను మన సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటాం. ఈ వృత్తిలో సానుభూతి, గౌరవం ఉన్నాయి’ అని ఆమె అంటున్నారు.



