Wednesday, June 10, 2026
E-PAPER
Homeజాతీయంభారత్‌‌పై తీవ్ర ఆర్థిక ఒత్తిడి

భారత్‌‌పై తీవ్ర ఆర్థిక ఒత్తిడి

- Advertisement -

పశ్చిమాసియా యుద్ధంతో భారం కేంద్ర ఖజానాపై భారం పెరుగుతున్న ద్రవ్యోల్బణ ముప్పు
న్యూఢిల్లీ : అమెరికా యుద్ధోన్మాదంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయిల్‌ యుద్ధం వల్ల ఎదురవుతున్న నష్టాలను భారత్ లెక్కగట్టుకోవాల్సి వస్తోందని రాయిటర్స్‌ ఓ కథనంలో తెలిపింది. యుద్ధం అనిశ్చితి ఇలాగే కొనసాగితే చమురు సరఫరాకు మరిన్ని ఆటంకాలు ఎదురైతే ఈ నష్టాలు మరింత పెరుగుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్‌ తన చమురు అవసరాలలో దాదాపు 90 ‌శాతం దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల ఈ యుద్ధం సుదీర్ఘకాలంగా సాగడంతో సరఫరా అంతరాయాల వల్ల అత్యధికంగా నష్టపోయే దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో దిగుమతుల భారం పెరిగిందని రాయిటర్స్‌ ‌వెల్లడించింది.

రూపాయి విలువపై, విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆర్బీఐ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. చమురు ధరలు ఇలాగే ఎక్కువగా ఉంటే, ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ఆర్థిక వనరులపై పడే భారం మరింత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ‘భారతదేశం వరుసగా సరఫరా షాక్‌లను ఎదుర్కొనే అవకాశం ఉంది,’ అని అబెర్డీన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎమర్జింగ్ మార్కెట్స్ ఎకనామిస్ట్ అయిన మైఖేల్ లాంగ్‌హామ్ అన్నారు. చమురు ధరల ఒత్తిడితో పాటు దేశంలో ఎరువుల సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే రైతులు వర్షభావానికి దారితీసే ఎల్ నినో వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ఇది గోధుమల వంటి కీలక పంటలపై ప్రభావం చూపనుందన్నారు. ఇవన్నీ భారతదేశ వృద్ధి అంచనాలను దెబ్బతీస్తాయని లాంగ్‌‌హామ్‌ ‌పేర్కొన్నారు. ఇంధన ధరల షాక్‌ను దాటుకుని ముందుకు వెళ్లడం ఆర్బీఐ మరింత కష్టతరంగా మారుతుందన్నారు.

భారత చమురు, గ్యాస్ దిగుమతుల బిల్లు మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో 53 శాతం పెరిగింది. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోటు భారీగా పెరుగుతుందని రాయిటర్స్‌ అంచనా వేసింది. 2026-27 లో భారత చెల్లింపుల లోటు సుమారు 65 బిలియన్లకు చేరొచ్చు. ఆర్‌బిఐ సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ.. రాబోయే మూడు నెలల్లో కనీసం 25 బేసిస్ పాయింట్లు, వచ్చే ఏడాదిలో 75 బేసిస్ పాయింట్ల కంటే ఎక్కువ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ద్రవ్య లోటును జీడీపీలో 4.3 శాతం గా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రాయిటర్స్ పోల్ ప్రకారం ఇది 4.7 శాతానికి పెరుగుతుందని.. మరికొందరు ఆర్థికవేత్తలు ఇది 5 శాతం వరకు కూడా వెళ్లవచ్చని హెచ్చరిస్తున్నారు.

భారత వృద్ధి 6.4 శాతమే…జీడీపీ అంచనాలకు ఫిచ్‌ కోత
భారత వృద్ధి అంచనాలకు ప్రముఖ రేటింగ్‌ ఎజెన్సీ కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలను గతంలో పేర్కొన్న 6.7 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా రాబోయే సెప్టెంబర్, డిసెంబర్ త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం ఉందని ఫిచ్ మంగళవారం ఓ రిపోర్ట్‌‌లో వెల్లడించింది. 2025-26లో భారత్ 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేయగా.. ఈ ఏడాది అది తగ్గనుందని ఫిచ్ అభిప్రాయపడింది. దేశంలో మూలధన వ్యయం బలంగా ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల పెరుగుతున్న ధరలు ప్రజల వాస్తవ ఆదాయాలను దెబ్బతీస్తాయన్నారు. తద్వారా వినియోగదారుల ఖర్చులు తగ్గుముఖం పట్టి ఆర్థిక వృద్ధి మందగిస్తుందని ఫిచ్ రేటింగ్స్ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే కేంద్ర మాత్రం జీడీపీ గణాంకాలను (7శాతానికి పైనే) పెంచుతూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దీనిపై ఆర్థిక నిపుణులు కూడా అసాధ్యమని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -