ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
సివిల్ సప్లయ్ శాఖ వద్ద ధర్నా
పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు వినతి
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ హామీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్టంలోని పేద ప్రజలకు రేషన్‌దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. గతంలో ఈ విధానం అమలులో ఉండేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతోపాటు మిగతా నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఐద్వా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని సివిల్ సప్లయ్ శాఖ వద్ద ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు ఐద్వా బృందం వినతిపత్రం అందజేశారు. రేషన్‌షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయాలనే విషయాన్ని ప్రభుత్వంతో చర్చించి, అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మల్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసనర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు.
నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని కోరారు. 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ అధికా రంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గించలేదని విమర్శించారు. ధరల పెరుగుదలను నియంత్రించటంలో కేంద్ర ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని అన్నారు. నిత్యావసర సరుకులు ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, స్కూల్ ఫీజులు పెరుగుతుండటంతో సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో 1.5 కోట్ల బీపీఎల్ కార్డులు ఉన్నాయనీ, 3.40 కోట్ల మంది సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి వ్యక్తికి ఆరు కేజీల బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆహార భద్రతను, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు బియ్యంతోపాటు, పప్పు రెండు కేజీలు, మంచినూనె రెండు కేజీలు, మొక్క జొన్నలు రెండు కేజీలు, చక్కెర ఒక కేజీ, కారం 500గ్రాములు, పసుపు 250 గ్రాములు, జీలకర్ర100 గ్రాములు, పామాయిల్ ఒక లీటర్, కొబ్బరి నూనె 25 గ్రాములు, ఆవాలు, జొన్నలు, పల్లీలు, సబ్బులు కలిపి 14 రకాల నిత్యావసర సరుకులు రేషన్ షాపుల ద్వారా అందించాల్సిన అవసరముందని చెప్పారు.
నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల మహిళలు సరైన పోషకాహారాన్ని తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల 50శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారనీ, తద్వారా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. పౌష్టికాహారం అందక దేశవ్యాప్తంగా లక్షలాది మంది పసిపిల్లలు మృతి చెందుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని కోరారు. ధర్నాలో ఐద్వా రాష్ట్ర సహాయకార్యదర్శులు కెఎన్ ఆశలత, కె. నాగలక్ష్మి, పి. శశికళ, వై. వరలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బట్టుపల్లి అనురాధా, ఐద్వా సీనియర్ నాయకులు లక్ష్మమ్మ, విజయ, సృజన, నవీన, షాబనాబేగం, మస్తాన్ బి, మస్క్ అరుణ, టి. సంధ్య, బి. సంతోష, ఇందిర, ఆర్. లక్ష్మి, లక్ష్మి, వెంకటమ్మ, కవిత, భవాని, రజియా తదితరులు పాల్గొన్నారు.



