కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి: సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమేష్
నవతెలంగాణ – అచ్చంపేట
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ కు అనుకూల విధానాలను ఉపసంహరించుకోవాలని, కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూర్పాటి రమేష్ పిలుపునిచ్చారు. గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అచ్చంపేటలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు ఉపాధినిచ్చే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లు అమలుతో దేశంలో 40 కోట్ల సంఘటిత, అసంఘటిత కార్మికుల పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ నాలుగు లేబర్ కోడ్ లతో కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితమయ్యహక్కు, నిరసనలు చేసే హక్కులపై ఉక్కు పాదం మోపుతుందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేశ నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్, నాగరాజు, సిఐటియు సహాయ కార్యదర్శి శంకర్ నాయక్, సైదులు, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పార్వతమ్మ కార్యదర్శి అలివేల, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా కార్యకర్తలు, హమాలీ కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, ఐకెపి, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.



