నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీల పని ప్రదేశంలో బుధవారం వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో కూలీలకు సురక్షితమైన తాగునీటి సౌకర్యాన్ని కల్పించేందుకు గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యుల సహకారంతో ఈ చలివేంద్రాన్ని ఉపాధి హామీ పని ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ కూలీల దాహార్తి తీర్చేందుకు చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ తమ ఉదారతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా కూలీలకు ప్రతి రోజూ తాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకం పనుల్లో వేడి నుంచి ఉపశమనం కల్పించి, కూలీల దాహార్తి తీర్చేందుకే చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉపాధి పని ప్రదేశంలో ప్రతిరోజు చల్లటి తాగునీటిని అందుబాటులో ఉంచనున్నట్లు సర్పంచ్ హారిక అశోక్ తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లోలం సురేష్, మామిడి అక్షయ్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ రమ, మేట్లు అరుణ, రాజు, జలంధర్, శరణ్య, ఉపాధి కూలీలు, తదితరులు పాల్గొన్నారు.



