Wednesday, June 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిరంతర విద్యుత్‌ సరఫరాకు స్టోరేజ్‌ గోడౌన్స్‌

నిరంతర విద్యుత్‌ సరఫరాకు స్టోరేజ్‌ గోడౌన్స్‌

- Advertisement -

త్వరలోనే రూ.5 లక్షల ‘ఇందిరమ్మ కుటుంబ బీమా :
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
భువనగిరిలో రూ.11 కోట్ల విద్యుత్‌ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన


నవతెలంగాణ-భువనగిరి

కనురెప్పపాటు కూడా విద్యుత్తు సరఫరా నిలిచిపోకుండా.. అంతరాయాలు లేకుండా ఉండేందుకే కొత్తగా సబ్‌స్టేషన్లు, స్టోరేజ్‌ గోడెన్స్‌ ఏర్పాటు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా పవిత్ర పరిధిలోని భువనగిరి కేంద్రంలో టీజీ ఎస్పీడీసీఎల్‌ రూ.5.83 కోట్లతో నిర్మించిన సర్కిల్‌ కార్యాలయ భవనాన్ని మంగళవారం ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు. భూదాన్‌పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామంలో రూ.2.67 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను కూడా ఈ సర్కిల్‌ కార్యాలయం నుంచే రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. భువనగిరి మండలం హనుమపురం గ్రామంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ ఎదురుగా రూ.2.03 కోట్లతో నిర్మించనున్న స్టోర్‌ కాంప్లెక్స్‌కు, వలిగొండ మండలం నర్సాపూర్‌లో రూ.3.52 కోట్లతో చేపట్టనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం భువనగిరి సర్కిల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. ఉచిత కరెంట్‌ ఇవ్వడమే కాదు, క్వాలిటీ పవర్‌ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో 18,546 మెగావాట్ల రికార్డు స్థాయి పీక్‌ డిమాండ్‌ నమోదైనప్పటికీ నిరంతర విద్యుత్‌ అందించామని చెప్పారు. రాబోవు రోజుల్లో రాష్ట్రంలోని మహిళలందరికీ అత్యధిక వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. త్వరలో కోటి 15 లక్షల కుటుంబాలకు ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ అమలు చేస్తామని తెలిపారు. బస్వాపురం భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి.. త్వరగా పరిహారం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు, రైతులకు విద్యుత్‌ సమస్య తలెత్తకుండా ఉండాలనే నూతనంగా 33/11 సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్‌ స్టోరేజ్‌ గోడౌన్స్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నందున.. భువనగిరి నియోజకవర్గంలోనే నూతన స్టోర్స్‌ ఏర్పాటు చేసుకుంటున్నట్టు చెప్పారు. దాదాపు 8 సబ్‌స్టేషన్లను త్వరలో నిర్మించుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, టీజేఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ పాటిల్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తంగెళ్లపల్లి శ్రీవాణి, తడక వెంకటేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ అవేస్‌ చిస్తీ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖాబాబురావు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -