Wednesday, June 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసాగులో ఉన్నోళ్లకే పట్టాలు

సాగులో ఉన్నోళ్లకే పట్టాలు

- Advertisement -

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం నిషేధిత భూముల జాబితా సవరణ
త్వరలో సాదాబైనామా సమస్య తీర్చుతాం
రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదర్బార్ నిర్వహించే యోచన
పాలేరు నియోజకవర్గం ప్రజాదర్బార్‌‌కు 25 వేల దరఖాస్తులు : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ద్వారా ఉత్పన్నమైన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనున్నదని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పొజిషన్‌‌లో ఉన్నవారికి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత భూముల జాబితాను సవరిస్తు న్నామని వెల్లడించారు. త్వరలో సాదా బైనామా దరఖాస్తుల కు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌‌లో ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డితో కలిసి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రాష్ట్రంలోనే వినూత్నంగా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌‌కు 25 వేల వరకు దరఖాస్తులు వచ్చినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టే దిశగా ప్రభుత్వం యోచన చేయనుందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ విజయవంతం కావడమే నిదర్శనమని తెలిపారు. పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా వర్గీకరించి, గత 30 రోజులుగా ‘ప్రజల వద్దకే ప్రభుత్వం’ అనే నినాదంతో ప్రజా దర్బార్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా దాదాపు 25వేల మంది ప్రజలను తాను వ్యక్తిగతంగా కలిసి, వారి సమస్యలను స్వయంగా కళ్లారా చూసి, చెవులారా విన్నానని చెప్పారు. ప్రజా దర్బార్‌లో అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 11,000, ఆసరా పింఛన్ల కోసం 5,200, భూ సమస్యలపై 4వేలకు పైగా అర్జీలు అందినట్టు వివరించారు.

​ఆధునిక డిజిటల్ సర్వే.. సాగులో ఉన్న వారికే పట్టాలు
​తరతరాలుగా భూమి సాగులో ఉన్న పట్టా పుస్తకాలు రావట్లేదని ఆవేదన చెందుతున్న రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి ఆధునిక భూ సర్వే నిర్వహిస్తు న్నట్టు మంత్రి తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం (కాకరవాయి) గ్రామంలో ఇప్పటికే ఈ సర్వే విజయవంతంగా పూర్తయిందన్నారు. ప్రభుత్వ అవసరాల కోసం కొంత భూమి సేకరిస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం నిషేధిత జాబితాలో పెట్టే పాత విధానాన్ని సవరించి, పట్టా భూములను ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియను దాదాపు పూర్తి చేశామన్నారు.

​నిర్ణీత కాలపరిమితిలో గృహాలు, ఇండ్ల స్థలాల కేటాయింపు
ప్రజా దర్బార్‌లో వచ్చిన అర్జీలను పరిష్కరించడానికి అధికారుల యంత్రాంగాన్ని విభజించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇండ్ల స్థలాల కోసం సేకరించిన భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించామని, ఎక్కడైతే నివాసానికి యోగ్యమైన ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిని సేకరించి రాబోయే కొద్ది రోజుల్లో ఇండ్ల స్థలాల సమస్యను కూడా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.​

​బురదజల్లే రాజకీయాలను తిప్పికొట్టిన ఓటర్లు
​కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు, పదేండ్లు దొరపాలన సాగించిన మాజీ మంత్రులు రాజకీయ దురుద్దేశంతో, స్వలాభం కోసం ప్రభుత్వంపై బురదజల్లుతు న్నారని, వారి మాటల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి కొట్టిపారేశారు. ప్రజా దర్బార్‌కు వచ్చిన వారు కేవలం కాంగ్రెస్ శ్రేణులు మాత్రమే కాదని, అన్ని పార్టీలకు చెందిన పేద ప్రజలు ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో వచ్చారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్ని కలు ఏవైనా సరే ఓటరు స్పష్టమైన తీర్పుతో ప్రజా ప్రభు త్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

​సాదాబైనామాల సమస్యకు శాశ్వత పరిష్కారం
గత ప్రభుత్వం ధరణి చట్టం తెచ్చే ముందు సాదాబైనామాల అప్‌లోడ్‌కు అవకాశం ఇచ్చి, ఆ తర్వాత చట్టంలో చేర్చకుండా రైతులను గాలికి వదిలేసిందని మంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 9,26,000 సాదాబైనామా దరఖాస్తుల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి మండలి నిబంధనలను సవరించిందని తెలిపారు. గతంలో భూమి అమ్మిన వారి సమ్మతి కూడా కావాలనే నిబంధన ఉండేదని, కానీ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, అమ్మిన వారి సమ్మతితో పని లేకుండా నిబంధనలు మార్చామన్నారు. ఇప్పటికే ఐదున్నర లక్షల దరఖాస్తులను గుర్తించి నోటీసులు ఇచ్చామని, మిగిలిన వాటికి మరో 15 రోజుల్లో నోటీసుల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. చట్టప్రకారం 30 రోజుల నోటీసు గడువు తర్వాత అర్హులైన అన్ని సాదాబైనామాలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -