Wednesday, June 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంట్రాక్టు, ఔట్‌‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ 1న జీతాలు

కాంట్రాక్టు, ఔట్‌‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ 1న జీతాలు

- Advertisement -

ఆలస్యమైతే అధికారులపై చర్యలు – వేతనాల చెల్లింపుల్లో జాప్యానికి సర్కారు చెక్‌ – ఆర్థిక శాఖ మార్గదర్శకాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, గౌరవ వేతనంపై పనిచేసే సిబ్బందితోపాటు గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెక్‌ ‌పెట్టింది. ఇక నుంచి వారికి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీతాలను ఆలస్యంగా ఇస్తే సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మంగళవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్‌‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, కొన్ని శాఖల్లో బిల్లుల సమర్పణలో జాప్యం, హాజరు వివరాల ఆలస్యం, ఆడిట్, పరిశీలన, అనుమతుల ప్రక్రియల్లో ఆలస్యం కారణంగా జీతాలు నెలాఖరున చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.

దీంతో ఆ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, రెగ్యులర్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గౌరవ వేతన సిబ్బందికి కూడా ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని వివరించారు. జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారని తెలిపారు. తాజా ఉత్తర్వుల ప్రకారం జీతాల బిల్లుల కోసం హాజరు గణనను ప్రతి నెల 21వ తేదీ నుంచి తదుపరి నెల 20వ తేదీ వరకు పరిగణించాలని సూచించారు. అన్ని జీత, వేతన బిల్లులను ప్రతి నెల 25వ తేదీలోగా సంబంధిత ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు సమర్పించాలని ఆదేశించారు. ట్రెజరీ, అకౌంట్స్ అధికారులు నెల చివరి పని దినంలోపు బిల్లుల పరిశీలన, ఆడిట్, అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డీడీఓలు) తగిన బడ్జెట్ నిధులు అందుబాటులో ఉండేలా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

శాఖాధిపతులు, కార్యాలయాధిపతులు జీత బిల్లుల సమర్పణ, ప్రాసెసింగ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. జీతాలు లేదా వేతనాల చెల్లింపులో పరిపాలనా నిర్లక్ష్యం కారణంగా ఆలస్యం జరిగితే సంబంధిత శాఖాధిపతి, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపడతామని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయ బాధ్యతను ఐఏఎస్ అధికారి గౌరవ్ ఉప్పల్‌కు అప్పగించామని తెలిపారు. ప్రతి ఉద్యోగికి ఒకటో తేదీన జీతం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -