సేకరించిన ధానాన్ని
కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి
సీఎం, నేను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా
కేంద్రం నుంచి స్పందన లేదు
రైతులను తప్పుదోవపట్టిస్తున్న బీజేపీ నేతలు
మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో ఆల్‌టైమ్ రికార్డు సాధించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సేకరించిన మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి తాను ఎన్నిసార్లు కేంద్రాన్ని కలిసి విన్నవించినా చలనం లేదని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, సీడ్ కార్పొరేషన్ చైర్మెన్ అన్వేష్ రెడ్డిలతో కలిసి ఉత్తమ్ విలేకర్లతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ విజయవంతంగా సాగుతుంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగా రైతుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బీజేపీ నాయకులు యాత్రల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని విమర్శించారు. రైతుల అవసరాలను పక్కనపెట్టి కేంద్రం కొనుగోలుపై పరిమితి విధించిందన్నారు.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. రబీ 2025-26 సీజన్‌లో తెలంగాణలో 65.91 లక్షల ఎకరాల్లో వరి సాగైందనీ, సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకుంటామంటూ చెప్పిందనీ, రైతులను ఆదుకునేందుకు సర్కారు ఇప్పటివరకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి చరిత్ర సృష్టించిందన్నారు. వీటి విలువ రూ.17,917 కోట్లకు చేరుకుందని, రైతులకు నేరుగా కనీస మద్దతు ధర చెల్లించామన్నారు. దేశ రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రానిది 61 శాతమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్కారు కేవలం 25.03 లక్షల టన్నులు కొనుగోలు చేసిందనీ, తెలంగాణ సర్కారు మాత్రం 75 లక్షల టన్నులు కొనుగోలు చేసిందన్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణ దాదాపు మూడు రెట్లు అధికంగా సేకరించిందన్నారు.
ఖరీఫ్, రబీ సీజన్లను కలిపి 2025-26 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్ర చరిత్రలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ అత్యున్నత రికార్డు నమోదు చేసిందన్నారు. మొత్తం 295 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య ఉత్పత్తిలో 147 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసి రైతులకు రూ.35,077 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించామని చెప్పారు. 25.20 లక్షల రైతు లావాదేవీలు విజయవంతంగా పూర్తయ్యాయని వివరించారు. దేశంలో రెండో స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 4,850 కేంద్రాలు మాత్రమే ఉండగా తెలంగాణలో వాటికంటే 1.7 రెట్లు ఎక్కువ కేంద్రాలు పని చేశాయని చెప్పారు. తెలంగాణలో రబీ ధాన్యం ఉత్పత్తి 28 శాతం పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు లక్ష్యాన్ని 79 లక్షల టన్నుల నుంచి 52 లక్షల టన్నులకు తగ్గించిందని విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లలో అదనంగా 57 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.16,645 కోట్ల మద్దతు ధర చెల్లించిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కోరారు.



