ఉద్యోగాల్లో చేరేవరకు మాదే బాధ్యత
టీజీఎమ్‌ఎఫ్‌సీ జాబ్‌మేళాలో మంత్రి అజారుద్దీన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ర్టంలోని ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు తదితర అన్ని మైనారిటీ వర్గాల యువతకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. ప్రభుత్వం లక్ష ఉద్యోగాల కల్పన దిశగా ప్రయత్నాలు చేస్తున్నదనీ, దానికోసం రాష్ట్రవ్యాప్తంగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. జాబ్ మేళా ఉద్దేశ్యం కేవలం ఆఫర్ లెటర్లు అందించడం మాత్రమే కాదని, ప్రతి అభ్యర్థి ఉద్యోగంలో చేరే వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. మంగళవారం నాంపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా తెలంగాణ రాష్ర్ట మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) సంయుక్తాధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. దీన్ని మంత్రి అజారుద్దీన్, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా అజారుద్దీన్ మాట్లాడుతూ మైనారిటీ యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం కోసం ఈ జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామన్నారు.
భవిష్యత్‌లో నిజామాబాద్‌లో పాటు మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గత పదేండ్లలో అమలుకాని అనేక కార్యక్రమాలు రెండున్నరేండ్ల ప్రజాప్రభుత్వంలో సాధ్యమయ్యాయని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నదని చెప్పారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన ఎంపానెల్డ్ ట్రైనింగ్ భాగస్వామ్య సంస్థల సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదనీ, విద్యావంతులైన నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, కెరీర్ మార్గదర్శకత్వం అందించడం వీటి ప్రధాన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మైనారిటీ గురుకులాల వైస్ చైర్మెన్ ఫహీముద్దీన్ ఖురేషీ, మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి బీ షఫీఉల్లా, ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహిర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.
భారీగా పాల్గొన్న నిరుద్యోగులు
టీజీఎంఎఫ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన మైనారిటీ జాబ్‌మేళాలో భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు. దాదాపు 60 కంపెనీలు దీనిలో భాగస్వామ్యమయ్యాయి. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, రిటైల్ అండ్ హాస్పిటాలిటీ, ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ మాన్యుఫాక్చరింగ్ అండ్ అసెంబ్లింగ్, ఆటోమొబైల్ అండ్ మొబిలిటీ, నిర్మాణరంగం మరియు మౌలిక వసతులు, ఐటీఈఎస్ / బీపీఓ, కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్ అండ్ హెల్త్‌కేర్, మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ రంగాలకు చెందిన పలు కంపెనీలతోపాటు శిక్షణా సంస్థలుకూడా పాల్గొన్నాయి. జాబ్‌మేళాలో ఉద్యోగార్థులకు ఆయా కంపెనీలు ప్రతినిధులు కెరీర్ కౌన్సెలింగ్ సేవలు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల గురించి వివరించారు.
మైనార్టీ యువతకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



