సత్యం ఎప్పుడూ కల్పనల కన్నా అద్భుతంగా ఉంటుంది. కొన్ని సత్యాలైతే మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని సంభ్రమంలో ముంచే స్తాయి – ఉదాహరణకు గత పన్నెండేళ్లుగా మన దేశంలో చూస్తున్నాం. ఆరోపణలు, ప్రత్యారోపణలూ, కమిటీలు, కమిషన్లు, కేసులు, నివేదికలు, దాడులు సోదాలు, పూటపూటకూ ఎన్నో ట్విస్ట్‌లు.. ఉంటున్నాయి. వార్తా ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న మనకు క్షణక్షణం సంభ్రమాశ్చర్యాలు కలుగుతున్నాయి. ప్రతిదీ నోరు వెళ్ల బెట్టే విషయమే- మరో గంటకు ఏమౌతుందోనన్న ఉత్కంఠతో, టెన్షన్‌తో రోజులు గడుపుతున్నాం. ఇదంతా మన దేశ నేతల కరుణా కటాక్షాల వల్ల- సినిమాలను తలదన్నే చిత్రవిచిత్రాలు అన్ని మాధ్యమాలలో చూస్తున్నాం. బహుశా ఏ కాల్పనిక నవలలోనూ ఇన్నిన్ని అద్భుతాలు జరగవేమో.
శాంతి, అహింస, పరమత సహనం ప్రభోదించిన జాతిపిత పుట్టిన రాష్ట్రంలో మానవతకే మచ్చగా మిగిలిన అమానవీయ, మతోన్మాద శక్తుల పదఘట్టనల కరాళ నృత్యాన్ని ‘గుజరాత్ ఫైల్స్’ కళ్లకు కట్టించింది కదా? ఆ వాస్తవాల్ని వాస్తవాలుగానే బయట పెట్టింది కదా! ప్రఖ్యాత పరిశోధనా జర్నలిస్టు – తెహల్కా ఉద్యోగి అయిన, రానా ఆయూబ్ రాసిన సంచలనాత్మక పుస్తకం? ‘గుజరాత్ ఫైల్స్’ కొంత మందయినా చదివి ఉంటారు. పరిశోధన కోసం ఆయన ‘మైథిలీ త్యాగి’గా పేరు మార్పుకుని, దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల పాటు ఒక ఇండో అమెరికన్ ఫిల్మ్ మేకర్‌గా రూపాంతరం చెంది అండర్ కవర్ ఆపరేషన్ చేసి- బయట పెట్టిన అనేక వాస్తవాలు రుజువులతో సహా ఆయన ఆ పుస్తకంలో భద్రపరిచారు.
నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన అక్కడ జరిపించిన ఎన్నో ఎన్కౌంటర్ల గురించిన వాస్తవాలు; సర్కారీ దౌర్జన్యానికి అక్కడి పోలీసు వ్యవస్థ ఎలా భాగస్వామ్యమయ్యింది కళ్లకు కట్టించిందే ఆ పుస్తకం! చైతన్య వంతమైన జీవితం – అని డబ్బా కొట్టుకున్న గుజరాత్ వెనుక చీకటినీడల జాడ తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పక చదవాలి.
నిజానికి ఆ పుస్తకం చదవాలంటే చాలా ధైర్యం కావాలి. సున్నిత మనస్కులు తట్టుకోగలరో లేదో గాని – అదయితే తప్పక చదవాల్సిన పుస్తకం! కళ్ల ముందే హింస జరుగుతూ ఉంటే, వివశులమై, నిస్సహాయంగా, మనసు కుదుట పరుచుకుని, నిస్తేజంగా చూస్తూ కూర్చున్నట్టుగా ఉంటుంది. నిజంలో, నిజాయితీలో వాస్తవంలో ఇంత గగుర్పాటు ఉంటుందా? అని అనిపిస్తుంది. అందుకే చెప్పేది కల్పనలలో కంటే వాస్తవంలోనే మేజిక్ ఎక్కువ! అందుకే కాబోలు రిచర్డ్ డాకిన్స్ THE MAGIC OF REALITY ని సిద్ధాంతీకరిస్తూ మంచి పుస్తకమే రాశాడు.
ఒక దశాబ్ద కాలంగా పాఠకుల అభిరుచి మారిపోయింది. కల్పనా సాహిత్యం, కవిత్వం, వెనకబడ్డాయి. వాస్తవ చిత్రణతో వచ్చే గ్రంథాలు- సైన్సు, చరిత్ర, ఆత్మకథలు, జీవిత చరిత్రలకు ప్రాముఖ్యం పెరిగింది. ఒకప్పుడు డిటెక్టివ్, క్రైమ్ థ్రిల్లర్ నవలలు, సాంఘిక నవలలు కొనుక్కుని చదువుకునేవారు. లేదా గ్రంథాలయాల నుండి తెచ్చుకుని చదివేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఏ వార్తా పత్రిక తిరగేసినా, ఏ టి.వి ముందు కూర్చున్నా, ఇంటర్నెట్లో ఏ సైట్ తెరచిచూసినా చాలు. బోలెడన్ని అద్భుతాలు.. ఊహకు అందని అశ్చర్యాలు.. గుండె వేగాన్ని పెంచే వాస్తవ కథనాలు! తీరిక చేసుకుని, క్యూలో నిలబడి, టికెట్ కొనుక్కుని ఏ థియేటర్లోనో కూర్చోనక్కరలేదు. అద్భుతాలు చూడాలనుకుని, మనల్ని మనం మానసిక సంసిద్ధతతో ఉంచుకుంటే చాలు – వాస్తవ జగత్తులోనే బోలెడంత మత్తు ఉంది.
ప్రభుత్వమే పని గట్టుకుని దేశపౌరుల్ని మతం మత్తులో, ద్వేషం మత్తులో ముంచుతూ ఉంది. ఇవి కాకుండా మంచినీరే దుర్లభమైపోతోంది గానీ, మాదక ద్రవ్యాలు, లిక్కరూ ప్రభుత్వం ఏరుల్లా పారిస్తోంది. ఇన్ని ఉన్నాక ఇక కల్పనా సాహిత్యం ఎందుకూ? పైగా గత యుగాల కల్పనా సాహిత్యంలోనే నేటి ప్రభుత్వాలు ప్రజల్ని నాన బెడుతున్నాయి. ప్రజలు నాని, నాని, సనాతనానికి విత్తనాలై ఆకలి, ఉపాధి, ప్రగతి లాంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం నేర్పించిన దేశభక్తి, హిందూ ముస్లిం – వంటి మాటలు అంధభక్తులు చిలక పలుకుల్లా వల్లిస్తున్నారు. జైశ్రీరామ్ నినాదంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
ఎలాంటి దేశం ఎలా అయిపోయిందన్న ఆందోళన అధికారంలో ఉన్నవారికి లేదు. రోజూ ఆరువందల మంది, ఈ దేశ పౌరసత్వాన్ని వదిలేసి వెళ్లి, విదేశాలలో స్థిరపడుతున్నారన్న బెంగలేదు. దేశరాజధానితో సహా దేశంలో పలు ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన గాలి కూడా పిల్చుకోలేనంత దుర్భరంగా ఉంటే ఆ విషయం మీద పార్లమెంట్లో చర్చ జరగదు. ఫాసిస్టు భావజాలంతో నవల రాసిన బంకించంద్ర ఛటర్జీ’ ‘ఆనంద మఠ్’ నవలలోని గేయాన్ని తిరగతోడి – అది అత్యంత ఆవశ్యకరమైన విషయమైనట్టు- పార్లమెంట్లో దాన్ని చర్చిస్తారు. ప్రజాధనం ఎలా వృధా చేస్తున్నారోనన్నది మనం ప్రత్యక్ష ప్రసారంలో మన ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటేచాలు. చాలా చాలా నేర్చుకోవచ్చు. శరవేగంగా మన సమాజాన్ని అనాగరిక కాలంలోకి బలవంతంగా తోసేస్తున్న ఈ ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. తప్పిస్తే – విమర్శిస్తే ఇక అంతే సంగతులు!
నీకు పౌరసత్యమే లేదంటారు. లేదా జైల్లోకి నెట్టేస్తారు.. ఈడి, సిబిఐ, కోర్టులు, పత్రికలు, మీడియా అన్నీ ఉండనే ఉన్నాయి. ఇవేవీ భరించలేని వాళ్లు ‘సజ్నా – తెరె సంఘ్ సంఘ్..’ అని పాడుకుంటూ వారి వాషింగ్ మిషన్‌లో దూరితే సరి! అన్నింటికి అన్నీ ప్రక్షాళనమైపోతాయి. క్లీన్ చీట్ గజదొంగల్లా బయటపడొచ్చు. వాస్తవ జగత్తులోనే అనూహ్యమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరుగుతున్నాయి చూడండని చెపుతున్నది అందుకే! రచయితలు రాసే కల్పనా సాహిత్యం ఎందుకు పనికొస్తుందీ? మీకు మనసనేది గనక ఉంటే. అది మిమల్ని బాధ పెడుతూ గనక ఉంటే- ముందు దాన్ని బయటికి లాగి పంపించేయండి. మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. జనహర్ లాల్ నెహ్రూ వందేమాతర గీతాన్ని ముక్కలు చేశారు గనకనే భారతదేశం హిందుస్తాన్-పాకిస్తాన్‌లుగా ముక్కలయ్యిందని ఈ దేశ ప్రధాని 2025 డిసెంబర్ 8న లోకసభలో ప్రకటించారు. ఈనగ సత్యాన్ని ఈ దేశ ప్రజలకు ఇంతవరకు తెలియజెప్పిన వారు లేరు కదా? ఈ దేశ ప్రజల మీద గల అవ్యాజమైన ప్రేమతో ప్రధాని చెపితే కదా తెలిసిందీ?
కల్పనా సాహిత్యం ఎందుకు పనికొస్తుందండీ ? ప్రస్తుత ప్రధాని భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ద్వేషిస్తున్నాడని, ఆయన్ని తక్కువగా చేసి మాట్లాడుతున్నాడని సామాన్యజనం అనుకుంటున్నారు. కానీ, విచిత్రమేమంటే మోడీజీకి నెహ్రూజీ పేరు తలవంది తెల్లవారదు. మాటమాటకూ నెహ్రూ పేరెత్తుతున్నాడంటే ఏమనుకోవాలీ? ఆయన నెహ్రూను అభిమానిస్తున్నాడనీ అనుకోవాలి. కావాలంటే చూడండి. ఆపరేషన్ సింధూర్‌ని పురస్కరించుకుని ఉపన్యసించేప్పుడు మోడీ – నెహ్రూ పేరు పద్నాలుగు సార్లు జపించారు. అలాగే రాజ్యాంగం రూపొందించుకుని డెబ్బయి అయిదేళ్లు అయిన సందర్భంలో ఉపన్యసిస్తూ మోడీ నెహ్రూ పేరు పదిసార్లు స్మరించుకున్నారు. ఇంత కచ్చితంగా ఎలా తెలిసింది. అనే అనుమానమే అక్కరలేదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు మోడీ స్కోర్ ఎంతయ్యిందో లెక్కగట్టి ప్రకటించారు. ఏ విషయం మీద ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా (టెలిప్రాప్టర్పై చదివినా) పాపం, మోడీ గారు నెహ్రూను తలుచుకోకుండా ఉపన్యసించలేరు. ”జినే హం భూల్నా చాహే – ఓ అక్సర్ యాద్ అతే హై” అనే సినిమా పాట మోడీ మనసులో పాడుకుంటూ ఉంటాడేమో కూడా!
ఆరెస్సెస్, బీజేపీల ఆలోచనల ప్రకారం తొలి ప్రధానిగా నెహ్రూస్థానంలో సర్దార్ పటేల్ రావల్సింది అని అంటుంటారు. తమకు అందిన ఓట్ చోరి బిరుదును నెహ్రూకు బహూకరించి – ”నెహ్రూ ఓట్ చోరీతో ప్రధాని అయ్యాడు”అని చెప్పుకుని సంతృప్తి పడతారు. ఢిల్లీలోని జేఎన్‌యు పేరు మార్చి ”జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ” అని కేరింతలు కొడతారు. జవహర్‌కు ముస్లిం వారసత్వాన్ని అంటగట్టామని పండగ చేసుకుంటారు. అది వారికొక తుత్తి! నెహ్రూ తన నివాస భవనాన్ని దేశానికి అంకితం చేశారు. ఆనంద నిలయం తర్వాత కాలంలో ”జవహర్ లాల్ నెహ్రూ మ్యూజియం” అయ్యింది. నెహ్రూ పేరు వినబడితే ఎలా? అని ఇప్పటి మోడీ ప్రభుత్వం దాన్ని ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం’గా మార్చింది. నిజానికి అందులో ఉన్నవన్నీ నెహ్రూజీ వస్తువులే. ఇతర ప్రధాన మంత్రులవి ఎవరివీ ఏమీ లేవు. విమర్శలు రాకుండా ఉండడానికి కనీసం ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం – అని అయినా అనాల్సింది.
అంధభక్తులకు అంత తెలివి ఎక్కడిది? వయసులో పెద్దవాడయినా పటేల్ స్వయంగా నెహ్రుకు ఉత్తరం రాశాడు. ”ఈ దేశానికి మీరు చేసిన త్యాగాల ముందు మేమంతా చిన్నవాళ్లం. ఆదేశిస్తే, దేశాభివృద్ధి కోసం నేను ఏ విభాగంలోనైనా పని చేయగలను” అని రాశాడు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన పుస్తకంలో పటేల్ ఉత్తరాన్ని కావల్సినవారు చదువుకోవచ్చు. పటేల్ దృష్టిలో నెహ్రూ మహోన్నతుడు. ఆరెస్సెస్ – బీజేపీ వారికి చెప్పుకోవడానికి నాయకుడు ఎవరూ లేక, గుజరాత్ వాడయినందుకు పటేల్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. హోంమంత్రిగా పటేల్ ఆరెస్సెస్‌ను రెండుసార్లు నిషేధించిన విషయం మాత్రం చెప్పుకోరు. పటేల్ విగ్రహం పెట్టుకున్నారేమో గాని, దేశప్రజల మనసుల్లోంచి నెహ్రూ స్నానాన్ని తగ్గించలేరు. అది వారివల్ల కాదు – భక్తులు కష్టకాలంలో ‘దేవుడా! దేవుడా!’ అని అంగలారుస్తారు. తమ భయాన్ని పోగొట్టుకుంటారు.
మోడీ-షాలు, ఆరెస్సెస్, బీజేపీలు ఏ కష్టమొచ్చినా ‘నెహ్రూ..నెహ్రూ’ అని అంగలారుస్తున్నారు. భయం పోగొట్టుకుంటున్నారు. చెప్పేది ఒకటి చేసేది మరొకటి. దేశ పౌరుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తడమంటే ఇదే! వాస్తవంలో మనకు కనిపిస్తున్న మేజిక్‌లు ఇలాంటి వేనన్నమాట!! అన్నింటికన్నా ఈ ప్రభుత్వం చేస్తున్న పెద్ద మేజిక్ ఏమిటంటే – చదువు పేరుతో పిల్లల్ని స్కూళ్లలో ఉంచకుండా స్వేచ్ఛగా రోడ్లమీద తిరగమని వది లేసింది. మహా మహా నాయకుల రాష్ట్రమైన గుజరాత్‌లోనే బడిమానేసిన పిల్లల సంఖ్య గత ఐదేళ్లలో 371 శాతం పెరిగింది. అంటే వారు 2.5లక్షల మంది! ఇక గత ఐదేళ్లలో బడి మానేసిన పిల్లల సంఖ్య దేశంలో 66 లక్షల మంది. ఈ చదువు రాని పాలకులు భావి భారత పౌరుల్ని తమంతటి వారిగా చేయాలని ఉబలాట పడుతున్నట్లుగా ఉంది. ఇలాంటి మేజిక్‌లు తెలుసుకున్నా ఈ దేశ పౌరులకు ఆనంద భాష్పాలు ఆటోమెటిగ్గా రాలిపోక ఏమవుతాయీ?
నేషనల్ బుక్ ట్రస్ట్ సలహా సంఘ పూర్వ సభ్యుడు, సాహితీవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు



